- దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోప్
- బైలాటరల్ న్యూమోనియాతో మరణం
- పవిత్ర ఈస్టర దినాల్లోనే మరణం
- 12 ఏళ్లుగా సేవలందించిన క్రైస్తవ మత పెద్ద
- వాటికన్ బయట పోప్ అంత్యక్రియలు
- మరో 15 రోజుల్లో తదుపరి వారసుని ఎంపిక
దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో ఉన్న క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ (88)కన్నుమూశారు. ఈ మధ్య కాలంలో రెండు సార్లు ఆయనకు న్యూమోనియా అటాక్ అయ్యింది. పేదల పెన్నిధిగా భావించే పోప్ కు ప్రపంచ వ్యాప్తంగా 14 వందల కోట్ల మంది కేథలిక్ ఆరాధకులున్నారు. 12 ఏళ్ల పాటు పోప్ గా సేవలందించిన ఫ్రాన్సిన్ తరచూ అనారోగ్యం పాలవుతూ అనేక మార్లు వాటికన్ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయ్యారు.పోప్ కన్నుమూత విషయాన్ని వాటికన్ పెద్ద కార్డినల్ కెవిన్ ఫారెల్ ప్రకటించారు.
ఈస్టర్ పర్వదినాల్లో కన్నుమూత
క్రైస్తవుల పవిత్ర దినమైన ఈస్టర్ రోజున ఆదివారం సెయింట్ బసిలికాలో బాల్కనీ నుంచి ప్రజలకు దర్శనమిచ్చిన పోప్ ఆమరుసటి రోజు అంటే ఇవాళ ఉదయం 7.35 నిమిషాలకు పరమపదించినట్లు వాటికన్ హౌస్ ప్రకటించింది.2013లో16వ పోప్ బెనిడిక్ట్ స్థానంలో ఫ్రాన్సిస్ బాధ్యతలు తీసుకున్నారు.
దీర్ఘకాలిక అనారోగ్యం
ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆసుపత్రిలో చేరిన పోప్ కు తొలుత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనుకున్నారు.ఆ తర్వాత అది బైలాటరల్ న్యుమోనియా గా తేలింది. పోప్ అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారని కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.అయితే ఆ తర్వాత ఆయన స్వల్పగా కోలుకున్నారు. మార్చి 23న ప్రజల సందర్శనార్ధం ఆస్పత్రి బాల్కనీనుంచి కనిపించారు. ఉత్సాహంగా థంబ్ ఇంప్రెషన్ కూడా చూపారు. ఆ తర్వాత రెండు నెలల రెస్టు నిమిత్తం డిశ్చార్జ్ అయ్యారు. ఫ్రాన్సిస్ కు 2023లోనే కొలోన్ సర్జరీ కాగా, అంతకుముందే హెర్నియా ఆపరేషన్ కూడా జరిగింది. ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని కూడా ఇన్ఫెక్షన్ కారణంగా తొలగించారు. ఫ్రాన్సిస్ కు మోకాలి నెప్పి ఉండటంతో వీల్ ఛైర్ వినియోగించేవారు.
అంత్యక్రియలు
పోప్ ను క్రైస్తవ కాథలిక్ సంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు. వందేళ్లలో తొలిసారి వాటికన్ బయట మతపెద్దకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు రోమ్ లోని శాంటా మారియా మగ్గొయిర్ బసీలికాలో ఖననం చేయనున్నారు. గతంలో పోప్ ల ఖననానికి గౌరవ సూచకంగా మూడు శవపేటికలు వినియోగించే వారు. కానీ ఫ్రాన్సిస్ మాత్రం తన ఖననానికి ఒకే శవపేటిక వినియోగించాలని అదీ కలప, జింక్ తో తయారైనదై ఉండాలని కోరుకున్నారు. తన పదవీ కాలంలో పోప్ విమర్శలు, ప్రశంసలు రెండూ మూటగట్టుకున్నారు. క్రైస్తవ సంప్రదాయాలను కాలరాశారని సంప్రదాయవాదులు విమర్శించగా, ప్రొగ్రెసివ్ ఆరాధకులు ఆయన మరింత ఆధునిక భావజాలంతో అడుగులేసి రెండు వేల ఏళ్ల నాటి చర్చిని మరింత ఆధునీకరించవలసిందని కోరుకున్నారు.
క్రైస్తవ కమ్యూనిటీలో ఆయన అంతర్గత అసమ్మతిని ఎదుర్కొన్నా సామాజిక న్యాయం విషయంలో ఎన్నడూ కట్టుతప్పలేదు. తన 12 ఏళ్ల సర్వీసులో 65 దేశాలు సందర్శించగా 47 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. 900మంది క్రైస్తవ సన్యాసులను తయారు చేశారు. మరో 15, 20 రోజుల్లో పోప్ వారసుని ఎంపిక జరగనుంది.