ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కొంతకాలం క్రితం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపినా, ఇప్పుడు మళ్లీ మౌన ముద్ర దాల్చింది. ఈ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.
దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. కేటీఆర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, ఏసీబీ ముందు హాజరై విచారణలో పాల్గొన్న కేటీఆర్.. ఆ తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.
అయితే ఇటీవల కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తనను ఏసీబీ, ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేయబోతున్నారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కానీ బడ్జెట్ సమావేశాలు ముగిసినా ఇప్పటి వరకూ అలాంటి పరిణామం ఏదీ జరగలేదు. పైగా.. అసలు ఆ కేసు విచారణ అప్‌డేట్స్ కూడా రావడం లేదు.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ కేసు తుది దశకు చేరిందని నెల క్రితం ఏసీబీ ప్రకటించినా, ఆ తర్వాత అధికారులు మౌనవ్రతం దాల్చడంతో దీని వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం మరో రకమైన చర్చ నడుస్తోంది. ఈ కేసులో ఎలాంటి అవకతవకలు జరగ లేదని, నిబంధనల మేరకే ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింనదని అంటున్నారు. పైగా ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చిందనే వాదన కూడా కొనసాగుతోంది. ఏసీబీ విచారణలో కూడా ఇదే తేలిందని, అందుకే ప్రభతుత్వం స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఇక అటు అధికార కాంగ్రెస్ వర్గాల్లో మరో కోణంలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారని భావించి తాము వేచి చూస్తుండగా, విచారణ ఆగిపోవడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో, ఈడీ కూడా ఇప్పటికీ ఈ కేసులో ముందడుగు వేయకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో అసహనానికి కారణమవుతోంది. కేటీఆర్‌కు ఈ కేసులో ప్రమేయం లేదన్నది తేలిపోతే.. ఇప్పటిదాకా సాగిందంతా ఒక రాజకీయ కక్షసాధింపు అన్న ఆరోపణలు బలపడతాయని అంటున్నారు. అందుకే, ప్రభుత్వం కూడా ఈ విషయంలో తొందరపడకుండా, ఈడీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.