26.4 C
Hyderabad
Sunday, July 26, 2026

Live Video

spot_img

పిఠాపురంలో పొలిటికల్ హీట్ : జనసేన – టీడీపీ మధ్య కుమ్ములాటలు

పిఠాపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలు గమనిస్తే.. తెలుగు దేశం పార్టీకి ఈ ప్రాంతంలో పట్టు సడలుతోందా? లేక జనసేన పార్టీ తన సొంత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోందా? ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇంతకీ కథ ఎక్కడ మొదలైంది? 2024 ఎన్నికల సమయంలో టీడీపీ నేత వర్మ, పవన్ కల్యాణ్‌ కోసం తన సీటును వదులుకున్నారు. ప్రతిగా ఎమ్మెల్సీ హోదా వస్తుందని భావించారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా.. ఏ అవకాశం రాకపోవడం, జనసేన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వర్మ అనుచరుల్లో అసంతృప్తిని రేకెత్తించింది.

ఇటీవల జనసేన సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురంలో మంటపెట్టాయి. వర్మ మద్దతుదారులు, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. ప్లీనరీ వేదికపై నాగబాబు, “పవన్ విజయం వెనుక ఎవరో ఉన్నారని అనుకుంటే అది వాళ్ల ఖర్మ” అన్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను కలిచివేశాయి. పైగా వర్మకు ఎమ్మెల్సీ అవకాశం రాకుండా, నాగబాబుకే ఆ గౌరవం రావడం, ఆయనకు మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వబోతున్నారన్న వార్తలు టీడీపీకి నచ్చడం లేదు. పైగా, పిఠాపురంలో నాగబాబు చేస్తున్న హడావుడి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు కలిగిస్తోంది. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం నాగబాబుకు భాధ్యతలు అప్పగిస్తున్నారన్న ప్రచారం ఈ పరిణామాలతో ఊతమిస్తోంది.

పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నాగబాబు పర్యటించిన సమయంలో వర్మకు ఆహ్వానం లేదు. దీంతో, నాగబాబు సభల్లో “జై వర్మ” అంటూ టీడీపీ శ్రేణులు, వర్మ అభిమానులు నినాదాలు చేయగా, వారికి పోటీగా జనసేన కార్యకర్తలు “జై జనసేన” అంటూ ప్రతి నినాదాలు చేశారు. ఈ పరిణామంతో పిఠాపురంలో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఇటీవల జరిగిన ఓ సంఘటన ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది. నాగబాబు పిఠాపురం పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో జనసేన నేత మొయిళ్ల నాగబాబు, మరో వ్యక్తి టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ నాగబాబే అంటూ మొదట ప్రచారం జరిగింది. కానీ, ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి మొయిళ్ల నాగబాబు అని పోలీసులు స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలోనూ ట్విస్ట్ నెలకొంది. ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది.

అయితే, పరిస్థితి అక్కడితో ఆగలేదు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మీద టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “వర్మ చెప్పినందుకే పవన్‌కి ఓటు వేసాం” అంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు వర్మ మళ్లీ పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. ఇక ముందు పిఠాపురం బాధ్యతలు నాగబాబు తీసుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమవుతున్నాయి. త్వరలోనే మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన – టీడీపీ మధ్య పొలిటికల్ వార్ పిఠాపురంలో టెన్షన్‌ వాతావరణాన్ని నెలకొల్పుతోంది. వర్మ త్యాగాన్ని గుర్తించకుండా వ్యవహరించడంపై టీడీపీ శ్రేణుల ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేసుల దాకా ముదిరిన ఈ వివాదం ఇంకెక్కడికి చేరుకుంటుందో వేచి చూడాలి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com