ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో ఒక్కటి కూడా లాభాల్లో లేదు. దీనంతటికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ముందు వెనకా ఏమీ ఆలోచించకుండా విధించిన ప్రతీకార టారిఫ్‌ల దెబ్బకు స్టాక్ మార్కెట్లన్ని కుదేలయ్యాయి. జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్ సహా భారత్ స్టాక్ మార్కెట్లలోని ప్రధాన సూచీలన్నీ కనీసం 3 నుంచి 10 శాతంలోపు నష్టాల్లో ఉన్నాయి.
1987 బ్లాక్ మండే రిపీట్ అవుతుందా ?
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూసి నిపుణులంతా 1987 అక్టోబర్ 19 నాటి పిరిస్థితులు రిపీట్ అవుతాయంటున్నారు. అప్పుడు కూడా ఇలానే బ్లాక్ మండే వచ్చింది. ఆ ఒక్క రోజే అమెరికా డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 22.6 శాతం పతనమైంది. ఇక అమెరికాలోని S&P సూచీ కూడా 30 శాతం విలువ కోల్పోయింది. ఈ దెబ్బకు ప్రపంచంలోని ఇతర స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఇది ఆ ఒక్కరోజుతో కాకుండా.. నెల రోజుల పాటు కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు ఈ టైమ్‌లో 20 శాతం విలువ కోల్పోయాయి.
ఇప్పుడీలాంటి సీనే ప్రపంచం చూడబోతుందన్న భయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్ కనిపించింది. మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 3000 పాయింట్లకు దిగజారగా.. నిఫ్టీ 22 వేల మార్క్‌ను దాటి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్ కొట్టుమిట్టాడుతోంది. ప్రీ ట్రేడింగ్‌లో అయితే సెన్సెక్స్ ఏకంగా 4 వేల పాయింట్ల వరకు పడిపోయింది. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి.
అమెరికాలో మార్కెట్లు కూడా భారీగా పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్ నిపుణులు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెబుతున్నారు. ట్రంప్ అర్జెంట్‌గా చర్చలు జరపగలిగే దేశాలతో చర్చించి వెంటనే టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గాలని లేదంటే అమెరికా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యే చాన్స్ తప్పదని చెబుతున్నారు.