– నదీ వాక్యం కవితా సంపుటి ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ
– ఏపీ ఆర్టీఐ కమిషనర్, ప్రముఖ జర్నలిస్ట్ రెహానా కలం నుంచి జాలువారిన నదీవాక్యం
– పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న జర్నలిస్టు పెద్దలు
– రెహానా బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్, ప్రముఖ జర్నలిస్టు రెహానా ‘నదీకావ్యం’ పేరుతో రూపొందించిన కవితా సంకలనాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. సాహసం, పరాక్రమం, ధైర్యం, తెగువ వంటి లక్షణాలున్న వాళ్లే రెహానా తరహాలో పాత్రికేయ రంగంలో సక్సెస్ అవుతారని కొనియాడారు. సమకాలీన పరిస్థితులు.. తన హృదయాన్ని తాకిన అంశాలతో పాటు ఆర్టీఐ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ కూడా ఇలాంటి మంచి పుస్తకాలు రాసేవాళ్లు అరుదుగా ఉంటారని బండారు దత్తాత్రేయ అన్నారు. అది కూడా మహిళగా, అందులోనూ ముస్లిమ్ మహిళగా లోతైన భావాలను కవితా రూపంలో ప్రస్ఫుటింపజేశారన్నారు దత్తాత్రేయ. రెహానా మస్తిష్కం నుంచి జాలువారిన కవితల అల్లికలతో కూడిన పుస్తకం చదివాక చాలా సంతోషం కలిగిందన్నారు. కవిత్వం అందరికీ రాదని.. మనసులో నుంచి, భావనలో నుంచి వస్తుందని అభిప్రాయపడ్డారు హర్యానా గవర్నర్. ఇన్ని లక్షణాల కలబోతగా ఉన్న ఉన్న వారికి భగవంతుడు సాయం చేస్తాడని దత్తాత్రేయ కితాబిచ్చారు. ప్రస్తుత రాజకీయాలకు ఆమె రాసిన కవిత్వం అద్దం పడుతోందన్నారు. విలువలతో ఉండాలనే సందేశం తన కవిత్వంలో ఉందని.. రాజకీయ నాయకులు దీన్ని పాటించాలని దత్తాత్రేయ కోరారు. ఓల్డ్ సిటీ లోని చార్మినార్, లాల్ బజార్ వంటి అంశాలపైనా రెహానా రాసిన కవితలు బాగున్నాయన్నారు. నదీ వాక్యం పేరు కూడా చాలా బాగుందని కితాబిచ్చారు దత్తాత్రేయ.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎవరూ సాహసించని విధంగా సరిహద్దుల్లోకి, భూకంపాలు జరిగిన చోటకు కూడా వెళ్లి రెహానా రిపోర్ట్ చేసిందన్నారు. అక్కడకు వెళ్లి పనిచేయడం సాహసంతో కూడినదని అంటూ స్త్రీ పురుష భేదం లేకుండా రెహానా పని చేసిందన్నారు. కవిత్వంలోనూ ఎంతో భావ కల్పితంగా అందించారన్నారు. రచన, కవిత్వం, జర్నలిజం అయిపోయి ఇప్పుడు సమాచార హక్కు చట్టం కమిషనర్ అయ్యారని అభినందించారు శ్రీనివాస్ రెడ్డి.
సభకు అధ్యక్షత వహించిన మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. తనకు కవిత్వంలో ప్రావీణ్యం లేకున్నా.. కవితలను చదివే వాడినని.. రెహానా జర్నలిజంలో రాణించడమే కాకుండా కవితలు రాయడం.. వాటిని సంకలనం రూపంలో పుస్తకం వేయించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
పుస్తక పరిచయం చేసిన కవి యాకూబ్ రెహానా కవితా సంపుటి నదీ వాక్యం పుస్తకంలోని అంశాలను వివరించారు. సమాజంలోని అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తూ.. ఆమె రాసిన కవితలు అద్భుతమన్నారు కవి యాకూబ్. చార్మినార్ ఏ సందర్భంలో ఎలా కన్పిస్తోందోననే విషయాన్ని రెహానా తన కవితల్లో అద్భుతంగా అభివర్ణించారని చెప్పారు కవి యాకూబ్.
ఏపీ మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెహానా రాసిన కవితలతో తనకు శ్రీ శ్రీ కవితలు గుర్తుకు వచ్చాయన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వల్లీశ్వర్ మాట్లాడుతూ గుంటూరు శేషేంద్ర శర్మ, తిలక్ కవితలను గుర్తు చేసేలా రెహానా కవితలు ఉన్నాయన్నారు. కవి యాకూబ్ చేసిన పుస్తక పరచయంతో ఆమె కవితల వెనుకున్న భావాలు అర్థమయ్యాయన్నారు వల్లీశ్వర్.
నేమాని మీడియా హౌస్ ఎండీ నేమాని భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్టీవీ రిపోర్టర్‌గా పని చేసే రోజుల్లో సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులను రిపోర్ట్ చేయడానికి ఆమెను ఎంపిక చేశామని గుర్తు చేసుకున్నారు. ఈటీవీ రిపోర్టర్‌గా ఉన్న సమయంలో ఆమె రాసిన, అందించిన, ప్రెజెంట్ చేసిన సాహసోపేత కథనాలను చూసి.. ఆమెను సరిహద్దులకు పంపాలని నిర్ణయించినట్టు చెప్పారు నేమాని భాస్కర్. సరిహద్దుల్లో ఆమె అనుభవాలను.. ఆమె చూసిన పరిస్థితులను.. వాస్తవాలను వివరిస్తూ పుస్తకం రాస్తే బాగుంటుందని కూడా గతంలో సూచన చేసినట్టు గుర్తు చేసుకున్నారు నేమాని.
ఏపీ ఆర్టీఐ కమిషనర్, ‘నదీవాక్యం’ రచయిత్రి రెహానా మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన నేపథ్యంలో ఆడపిల్ల చదువుకోవడమే కష్టంగా ఉండేదన్నారు. 8వ తరగతిలో మొదటగా కవిత రాశానని గుర్తు చేసుకున్నారు రెహానా. జర్నలిజంలోకి వచ్చాక కవులు, రచయితలను కలవడంతో పాటు.. వాళ్లను దగ్గరగా చూసే అవకాశం రావడంతో.. రచన, సాహిత్యంలో అవగాహన కలిగిందన్నారు. జర్నలిస్టుగా విభిన్న వర్గాల వారిని చూశానని.. సమాచారం సేకరించే సందర్భంలో భావోద్వేగాలకు గురవుతుంటానని వాటిని కవితలుగా చెబుతుంటానని చెప్పారు. ప్రతి జీవితంలో సంక్షోభాలు ఉంటాయి.. అలాంటివి నాకూ ఉంటాయి.. కానీ కవిత దైర్యం చెబుతుందన్నారు రెహానా.