సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి కొత్త హంగులు అద్దుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడున్న రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నారు. భారీ నిర్మాణాలు, మార్పులు జరుగుతున్నాయి. ఈ భారీ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రానున్న కొద్ది నెలల పాటు.. ప్రయాణీకులకు కొన్ని అసౌకర్యాలు ఎదర్కోవాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కై కాంకోర్స్, ఆధునిక లిఫ్టులు, ఎస్కలేటర్లు, మరియు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టబోతున్నారు.
ఈ నిర్మాణాల కోసం ప్లాట్‌ఫామ్స్ 2, 3, 4, 5, 6లను దశలవారీగా 100 రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ప్లాట్‌ఫారాల మూసివేత చర్యలు అమలులోకి వస్తాయని రైల్వే శాఖ తెలిపింది. దీంతో సుమారు 120 రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు జరుగనున్నాయి. వీటిలో చాలా రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపించనున్నారు. మరికొన్ని ట్రెయిన్లు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.
110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న స్కై కాంకోర్స్ ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో విశాలంగా వేచి ఉండే ప్రదేశాలు, రిటైల్ ఔట్‌లెట్లు, రెస్టారెంట్లు, కియోస్క్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నారు. రెండు అంతస్తుల్లో ఉండే ఈ కాంకోర్స్‌ను లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ద్వారా అన్ని ప్లాట్‌ఫామ్స్‌కి కలుపుతారు.
అంతేకాకుండా, మొత్తం ట్రాక్ పైన పైకప్పు నిర్మాణం కూడా ఈ పనుల్లో భాగంగా చేపడతారు. మొదటగా ప్లాట్‌ఫామ్స్ 2, 3, 4, 5 వద్ద ఈ పైకప్పు పనులు ప్రారంభమవుతాయి. అనంతరం ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు మళ్లుతాయి. అలాగే, ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 నుండి 10 వరకు ఒక పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీనికి అవసరమైన 500 టన్నుల సామర్థ్యం గల భారీ క్రేన్‌ను ప్లాట్‌ఫామ్ 5, 6 మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రేన్‌ను స్థిరంగా ఉంచేందుకు ఇసుక బస్తాలతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా ఈ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా 15 రోజులపాటు మూసివేయనున్నారు.
ఈ పనుల నేపథ్యంలో మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లు తాత్కాలికంగా అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిత్యం 250 రైళ్లు నడిచే ఈ స్టేషన్‌లో, ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు శాశ్వతంగా తరలించారు. ఇప్పుడు మరో 120 జతల రైళ్లు తాత్కాలికంగా ఇతర స్టేషన్‌ల ద్వారా నడపనున్నారు.
ఇవన్నీ గమనించి ప్రయాణికులు తమ జర్నీ ప్లాన్లను ముందుగానే సర్దుబాటు చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.