తెలంగాణలో బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధిత ప్రాంతాల్లో పరిశీలనలు నిర్వహించి నమూనాలను ల్యాబ్‌కి పంపగా, బర్డ్ ఫ్లూనే కారణమని తేలింది. వెంటనే అక్కడి పౌల్ట్రీ ఫామ్‌లను అధికారులు సీజ్ చేసి, రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇక సిద్ధిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలోని ఓ లేయర్ ఫారంలో కూడా బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ఫామ్‌లోని ఐదు షెడ్లలో ఉన్న మొత్తం 1.45 లక్షల కోళ్లను తగిన జాగ్రత్తలతో నశింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. వీరంతా పీపీఈ కిట్లు ధరించి కోళ్లను తొలగిస్తున్నారు.
కాన్గల్ గ్రామంలో బర్డ్ ఫ్లూ ధృవీకరణ అయిన తరువాత అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామంలో 512 కుటుంబాలు ఉండగా, ఆశా వర్కర్లు ఇప్పటికే 150 ఇండ్లను సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించారు. మిగిలిన ఇండ్లలో సర్వేను మరో రెండు రోజుల్లో పూర్తిచేసి, అవసరమైనవారికి వైద్య సేవలు అందించనున్నారు.
ఇంతలో మెదక్ జిల్లాలోని పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొత్తం 44 లేయర్, బ్రాయిలర్ ఫారాలు ఉండగా, వాటిలో సుమారు 60 లక్షల కోళ్లు ఉన్నట్లు అంచనా. కాన్గల్ పరిధిలోని ఫారంలో బర్డ్ ఫ్లూ బయటపడటంతో, దాని చుట్టుపక్కల ఉన్న ఐదు ఫారాలకూ ముప్పు పొంచి ఉంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న ఫారాల కోళ్లను కూడా చంపే అవకాశం ఉంది. ఈ పరిణామంతో పౌల్ట్రీ రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.