దేశానికి ఓ చిహ్నంగా మారిన వారసత్వ సంపదల్లో ఒకటి రాజధానిలోని ఎర్రకోట. అలాంటి ఎర్రకోట తమ వంశానిదే కాబట్టి.. తమకే అప్పగించాలంటూ మొఘల్ వారసులు న్యాయపోరాటానికి దిగారు. ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-II ముని మనవడి భార్య సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2021లో వేసిన పిటిషన్ ఇది. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ తమ పూర్వీకుల నుంచి అక్రమంగా ఎర్రకోటను తీసుకుందని.. ఇప్పుడు తమ కుటుంబానికి అప్పగించాలన్నారు. అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఇదంతా జరగడానికి ఇన్నేళ్లు పట్టింది.
కోర్టు ఈ పిటిషన్‌ను విచారించే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పుడెప్పుడో అంటే అటు ఇటుగా 150 ఏళ్లకు ముందు స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం ఏంటని ప్రశ్నించింది. అప్పీల్ చేసుకోవడంలో జరిగిన విపరీత జాప్యం కారణంగా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
ఇంతకీ ఎర్రకోట కథేంటి?
ఎర్రకోట కథ 1628లో మొఘల్ సింహాసనాన్ని అధిరోహించిన చక్రవర్తి షాజహాన్ చక్రవర్తితో మొదలవుతుంది. వాస్తుశిల్పం, కళల పట్ల అతని అభిరుచికి ప్రసిద్ధి చెందిన షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇదే ఎర్రకోట పుట్టుకకు దారితీసింది. కోట నిర్మాణం 1638లో ప్రారంభమై.. 1648లో పూర్తయింది. దాదాపు 250 ఎకరాల్లో నిర్మించారు ఈ కోటను. అప్పట్లోనే కోట నిర్మాణానికి కోటి రూపాయల వరకు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. షాజహాన్ నుంచి ఆ తర్వాత అనేక మంది రాజుల చేతుల మీదుగా చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్-II చేతికి వచ్చింది.