ఆది నుంచీ తెలుగుదేశం పార్టీ ఒక పద్దతి ఫాలో అవుతుంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడి నాయకత్వంలోకి పార్టీ వచ్చాక పదవుల పంపకం, ఎంపికల విషయంలో ఒక ట్రెండ్ సెట్ చేశారు. టీడీపీకి ఎటువంటి అధికారిక పదవులు వచ్చే అవకాశం ఉన్నా వాటికి పర్మినెంట్ పోటీదారుడుగా ఒక నాయకుడిని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ సదరు నాయకుడు పదవి ఎప్పుడూ పొందలేడు. అది ఎమ్మెల్సీ పదవి కానీ, రాజ్యసభ కానీ తమ చేతుల్లో లేని గవర్నర్ పదవి కానీ… అవకాశం ముందుకు వచ్చినప్పడల్లా పర్మినెంట్ గా ఒక నాయకుడి పేరు తెరమీదకు వస్తుంది. చివరి క్షణం వరకూ ఆ పదవిని వరించడానికి సదరు నాయకుడ్ని పెళ్ళి కొడుకుని ముస్తాబు చేసినట్లు చేస్తూ ఉంటుంది పార్టీ. నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకోవడం, లాయర్లు, ఆడిటర్లతో అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసి ఇక నామినేషన్ వేసి పదవి చేపట్టడమే తరువాయి అన్నంతగా ఊరిస్తారు. తీరా చూస్తే చివరాఖరి క్షణంలో ఫలానా సమీకరణ వల్ల నీ పేరు మ్యాచ్ కావడం లేదు కాబట్టి ఈ సారి చూద్దాం అని అనేస్తారు చంద్రబాబు. పాపం ఉసూరుమన్న సదరు పర్మినెంట్ పోటీదారు తరువాత వచ్చే అవకాశాల కోసం ఎదురు చేస్తూనే ఉంటారు.
మోత్కుపల్లి నర్శింహులు… నిబద్దత కలిగిన దళిత నాయకుడు… సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తెలంగాణ నేత. రాష్ట్ర విభజన సమయంలోలో టీడీపీ తరపున ప్రెస్ మీట్లు పెట్టాలన్నా, ప్రజల ముందుకు రావాలన్ని తెలుగుదేశం పార్టీ ఫేస్ మోత్కుపల్లే. రెండు కళ్ళ సిద్దాంతంతో అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణలోను గడ్డ పరిస్ధితులు ఎదుర్కొంటున్న సమయంలో మోత్కుపల్లే తెలంగాణలో టీడీపీని గాడిలో పెట్టారు. కేసీఆర్, టీఆర్ఎస్ లపై ఎటాకింగ్ సిద్దాంతంతో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపాయి. ఆ సమయంలో టీడీపీకి రెండు రాజ్యసభ స్ధానాలు దక్కే అవకాశం వచ్చినప్పుడు అందులో ఒకటి మోత్కుపల్లికి ఖాయమంటూ పార్టీనే ప్రచారం చేసింది. రాష్ట్ర విభజన అప్పటికే ఖరారు కావడంతో తాను అసెంబ్లీకి పోటీ చేయడం కంటే రాజ్యసభకు వెళ్లడమే ఉత్తమమైన పనని మోత్కుపల్లి రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా జడ్జిమెంట్ డేట్ వచ్చే సరికి చంద్రబాబు మోత్కుపల్లి స్ధానంలో పార్టీలో ఎవరూ కాదనలేని గరికపాటి మోహనరావు పేరును తెరపైకి తెచ్చారు. అంతకు ముందు చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం పాయాత్ర ఆద్యంతం గరికపాటి దగ్గరుండి చూసుకుని వియవంతం చేశారు. ఈ మిషతో నీకు మరోసారి అవకాశం ఇస్తా ఇప్పుడు మోహనరావుని రాజ్యసభకి పంపుదామని మోత్కుపల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఊహించని ట్విస్ట్ తో హర్టైన మోత్కుపల్లి పార్టీని వీడదామనే నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ కోసం ఎంతో చేసిన మోత్కుపల్లి క్లిష్ట సమయంలో పార్టీ వీడితే కార్యకర్తలు నాయకత్వంపై విశ్వాసం కోల్పోతారనే ఆందోళనతో గవర్నర్ పదవి ఆశ చూపారు. ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి టీడీపీకి ఒక గవర్నర్ పదవి వస్తుందని దాన్ని మోత్కుపల్లికి ఇస్తామని ప్రచారం చేశారు. 2014 నుంచి 2018 వరకూ మోత్కుపల్లి గవర్నర్ పదవి కోసం స్వాతివానకు ముత్యపు చిప్పలా ఎదురు చూస్తూనే ఉన్నారు. మోడీతో విభేదించి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో మోత్కుపల్లి ఇక గవర్నర్ పదవిపై ఆశలు వదులుకుని తెలుగుదేశం పార్టీనే వీడారు.
తాజాగా అప్పటి మోత్కుపల్లి స్ధానంలో ఇప్పుడు వర్ల రామయ్య వచ్చారు. వర్లకైతే ఆశచూపని పదవి లేదు. నామినేటెడ్ పోస్టు నుంచి ఎమ్మెల్సీ, రాజ్యసభ చివరికి ఇప్పుడు గవర్నర్ పదవికి కూడా వర్ల పేరును ముందుకు తెస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా శాసనసభ్యుడిగా పోటీ చేసిన వర్ల రామయ్య ఓడిపోయారు. అయితే తాను పార్టీకి చేసిన సేవలకు తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు వర్ల. చంద్రబాబు కూడా అందుకు అనుగుణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా వర్ల పేరు తీసుకువచ్చేవారు. కానీ ఆ టర్మ్ లో ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఆర్టీసీ చైర్మన్ పదవితో సరిపెట్టారు. ఆ తరువాత రాజ్యసభ అవకాశం వచ్చినప్పడు అన్ని ఏర్పాట్లు చేసుకోమని వర్లకు చెప్పి చివరి నిమిషంలో వేరొకరికి ఇచ్చారు. వైసీపీ హయాంలో ఒక ఎమ్మెల్సీ గెలుచుకునే అవకాశం వచ్చినప్పుడుకు కూడా వర్లను ముందు వరసులో నిలబెట్టారు. కానీ వడ్డించేటప్పుడు మాత్రం పంచుమర్తి అనురాధను ఆ పదవిలో కూర్చోపెట్టారు. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు రాజీనామాలు చెయ్యడంతో ఎన్నికలు వచ్చాయి. ఈ సందర్భంలో కూడా మొదట వినిపించిన పేరు వర్ల రామయ్యే. అయితే ఉన్న మూడింటిలో ఒక దానిని రాజ్యసభకు రాజీనామా చేసిన బీద మస్తాన్ రావుకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక మిగిలిన రెండు సీట్లలో ఒకటి బీజీపీ కోటాలో మళ్ళీ వైసీపీ నుంచే వచ్చిన ఆర్. కృష్ణయ్యకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఒక్క రాజ్యసభ స్ధానం కోసం గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ లాంటి ఆర్థిక బాహుబలులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో వర్ల పేరు మళ్ళీ గల్లంతయ్యే అవకాశమే ఎక్కువని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం కొత్తగా వర్ల రామయ్యతో పాటు, ఆశోక్ గజపతి రాజు పేర్లను గవర్నర్ పదవుల కోసం ప్రచారంలోకి తచ్చారు. దీంతో ఇక వర్ల రాజ్యసభ ఆశావాహుల జాబితా నుంచి ఔటైపోయినట్లే అంటున్నారు టీడీపీ రాజకీయాలు బాగా వంటబట్టించుకున్న సీనియర్లు.