ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో సారి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై.. రాజధాని నిర్మాణ పనులకు పునః శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్నారు. రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదని.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని చెప్పారు.”మా కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు నన్ను అడిగారు. అమరావతి.. ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టింది. దేశమే తన కుటుంబంగా మోదీ భావిస్తున్నారు. అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అమరావతి ప్రపంచస్థాయి రాజధానికి మారుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోడీ అమరావతి పునఃనిర్మాణ సభకు వచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వని కారణంగా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది.20 ఏళ్ల ముందే భవిష్యత్‌ను ఊహించి ప్రణాళికతో ముందుకు వెళ్ల గల నేత చంద్రబాబు” అని పవన్ కల్యాణ్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
ఇక, ఇదే సభలో ఏపీ మంత్రి నారాలోకేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై పోరుతో పాటు కుల గణన విషయంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే అమరావతి రాజధానికి ప్రధాని అందిస్తున్న సహకారానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ గీత దాటిందని, అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసిందని మంత్రి లోకేష్ అన్నారు. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరన్నారు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక మిసైల్ మన దగ్గర ఉందన్నారు. ఆ మిసైల్ పేరు నరేంద్ర మోదీ అన్నారు. సింహం ముందు ఆటలు ఆడకూడదన్నారు. మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ అని రావడం ఖాయమన్నారు. పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేసే వారు సెలవు పెట్టి పారిపోతున్నారని, కొంత మంది రాజీనామా చేస్తున్నారని లోకేష్ తెలిపారు. దటీజ్ నరేంద్ర మోదీ అన్నారు. నమో కొట్టే దెబ్బకి పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయమన్నారు. పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుందన్నారు.
కేంద్రం కుల గణన చేయాలని తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం అని లోకేష్ తెలిపారు. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన ఒక కీలక అంశంపై మోడీ జీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరిగి రాశారన్నారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే నిబద్ధతకు లోబడి మోడీ జీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుందన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారని లోకేష్ తెలిపారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెంచుకున్న పెరటి మొక్క కాదన్నారు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అన్నారు. అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని నమో అన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దానిని ఆపే దమ్ము ఎవడికీ లేదన్నారు. 1631 రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయని, ఇక మనకు తిరుగులేదని లోకేష్ తెలిపారు. అమరావతి అన్‌స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్ తో జరగబోతుందన్నారు.