అమరావతి స్వప్నం కళ్లముందు కనిపిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరావతి అనేది కేవలం ఒక నగరం కాదని, అదొక శక్తి అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆహూతులను తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్నందరినీ కలవడం ఆనందంగా ఉందని అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు తాను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నానన్నారు. ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుందని చెప్పారు.
దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానని చెప్పారు. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదని, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులు అని ప్రధాని అభివర్ణించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇంద్రలోకం రాజధాని పేరు అమరావతి అని.. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే అని.. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభసంకేతం అని ఆకాంక్షించారు. ఆధునిక ప్రదేశ్‌గా ఏపీని మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని అభివర్ణించారు. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందన్నారు. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి నిలుస్తుందన్నారు. అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారని, తాను గుజరాత్ సీఎం అయినప్పుడు హైదరాబాద్‌లో ఐటీని ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానన్నారు. ప్రత్యేకంగా అధికారులను పంపి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించానని మోదీ చెప్పారు. ఏవైనా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తిచేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. పెద్దపెద్ద పనులు పూర్తిచేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని ఏపీ సీఎంను ప్రశంసించారు.
2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని, గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందని ప్రధాని చెప్పారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్నిరకాలుగా సహకరించిందన్నారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అమరావతిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ సహా అన్నిరకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందన్నారు. ఎన్టీఆర్.. వికసిత ఏపీ కోసం కలగన్నారని, మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలన్నారు. పవన్‌కల్యాణ్ గారూ.. ఇది మనం చేయాలి.. మనమే చేయాలి అని నరేంద్ర మోదీ నొక్కి వక్కాణించారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందన్న ప్రధాని.. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల సాయం చేస్తోందన్నారు. ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని, రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుందని మోదీ చెప్పారు. ఈ అనుసంధానం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కలిపి కేవలం 900 కోట్లలోపే బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు కేవలం ఏపీకే 9 వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని చెప్పారు. గతానికంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించామని, ఏపీకి వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించామని, అలాగే.. ఏపీలో 70కి పైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని నరేంద్ర మోదీ చెప్పారు. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీలో వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. రైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషిచేస్తోందని, రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17 వేల కోట్లు సాయం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పీఎం సమ్మాన్ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నామన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదలు, యువత అభివృద్ధి చెందాలని.. అలాగే, మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ నాలుగు వర్గాలు సమాజానికి నాలుగు స్తంభాల లాంటివారని నరేంద్ర మోదీ అభివర్ణించారు.