-
అక్కడి ఓటు బ్యాంకుపై పవన్ నజర్
-
ఉప ముఖ్యమంత్రి హోదాలో టూర్
-
ఇప్పటికే రెండు సార్లు మన్యంలో పర్యటన
-
ఏ మంత్రీ వెళ్లని గ్రామాలకు వెళ్లిన పవన్ కల్యాణ్
-
వైసీపీ ఓటు బ్యాంకు టర్న్ చేసుకునే బిగ్ ప్లాన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్ వేశారు. మన్యంలో ఆదివాసీల ఓటు బ్యాంకుపై నజర్ పెట్టారు. వాగులు, వంకలు, కొండలు, గుట్టలే ప్రపంచంగా బతుకుతున్న ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మన్యం ఆదివాసీల గూడేల్లో పర్యటనలు చేస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రెండు సార్లు మన్యంలో పర్యటించి అక్కడ జనాలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు ఏ మంత్రి కూడా వెళ్లని గ్రామాల్లో పవన్ కల్యాణ్ కాలినడకన వెళ్లి పర్యటిస్తున్నారు.
పవన్ కల్యాణ్ పక్కా వ్యూహం :
డిప్యూటీ సీఎం పర్యటన కావడంతో అనివార్యంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా పవన్ కల్యాణ్ వెంట ఉంటోంది. ఎప్పుడో ఏదైనా అవసరం వస్తే.. సర్కారు కార్యాలయంలో చూసిన అధికారులను తమ గూడేల్లో చూస్తున్నారు ఆదివాసీలు, ఇక.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన పవన్ కల్యాణ్‌కు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సామాజిక అవసరాలను చెప్పుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ అవకాశం ఉన్న మేరకు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో డోలీలే దిక్కుగా బతుకుతున్నామని ఆదివాసీలు పవన్ కల్యాణ్ దృష్టికి తేవడంతో.. పలు గ్రామాలకు రాకపోకలు సాగించే విధంగా తారురోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు.
గత డిసెంబర్‌లో మన్యంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామరాజు జిల్లా హట్టగూడ గ్రామానికి వెళ్లినప్పుడు ఈ సమస్యను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు రావడంతో ఉపాధి హామీ నిధులతో తారురోడ్డు నిర్మించేలా అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. దీంతో, వారం రోజుల్లోనే సుమారు మూడు కిలో మీటర్ల మేర తారు రోడ్డు నిర్మించారు. అక్కడి ప్రజల్లో చర్చను లేవనెత్తారు.
నాలుగు నెలల్లోనే రెండు సార్లు పర్యటనలు :
ఉప ముఖ్యమంత్రి హోదాలో గత యేడాది డిసెంబర్ 20వ తేదీన పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సాలూరు నియోజకవర్గంలోని బాగుజోల గ్రామంతో పాటు.. మార్గమధ్యంలో పలు గ్రామాల్లో ఆగి పవన్ కల్యాణ్ స్థానికులతో ముచ్చటించారు. అరకు వ్యాలీ మండలం చినలబుడు, పద్మాపురం గ్రామ పంచాయతీలతో పాటు.. పక్కన కుడి, మంజాగూడ, తుడుము, మాలివలస, రణజిల్లేడ వంటి గ్రామాలకు లింకు రోడ్డు నిర్మాణాన్ని ఉపాధి హామీ పనులతో పూర్తి చేయించారు.
ఇక, నాలుగు నెలలు కూడా కాకముందే.. ఇప్పుడు రెండో విడత పర్యటన కూడా పూర్తి చేసుకున్నారు పవన్ కల్యాణ్. ‘అడవి తల్లి బాట’ పేరుతో ఏప్రిల్ 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు మరోమారు మన్యంలో పర్యటించారు పవన్ కల్యాణ్. ఏడోతేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామంలో గిరిజనుల ఆవాసాలను సందర్శించి.. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరుసటి రోజు.. అరకు మండలం సుంకరమిట్టలో ఉడెన్ బ్రిడ్జ్ ప్రారంభించడంతో పాటు.. పలు గ్రామాల్లో పర్యటించారు.
వైసీపీ ఓటు బ్యాంకుకు ఎసరు :
అయితే, పవన్ కల్యాణ్ మన్యం పర్యటనకు అత్యంత వ్యూహాత్మకంగానే ప్లాన్ చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతం మన్యం. అప్పటినుంచీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తగా ఓట్లేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అక్కడ పాగా వేయడానికి దాదాపు దశాబ్దంనర కాలంగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఎంతగా ప్రయత్నించినా టీడీపీ వైపు అక్కడి ఓటర్లు మొగ్గు చూపలేదు. గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటీ, రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అంటే, గిరిజనులు తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ అంతగా కనెక్ట్ కావడం లేదు. అయితే, అలాంటి ప్రాంతాన్ని తనవైపు తిప్పుకుంటే తిరుగు ఉండదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. అందుకే ఎన్నికల స్టంట్‌గా కాకుండా.. ఇప్పటినుంచే తనకున్న వెసులుబాటుతో అధికార యంత్రాంగంతో సహా మన్యం గూడేల్లో పర్యటనలకు పవన్ కల్యాణ్ ప్రణాళికలు వేసుకుంటున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా, సీరియస్‌గా అటువైపు దృష్టిపెట్టారు. ప్రధానంగా ట్రైబల్ ఓటు బ్యాంక్‌ను పూర్తిస్థాయిలో తనవైపు తిప్పుకోవడమే పవన్ కల్యాణ్ వ్యూహంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓటు బ్యాంక్ మాత్రం ఫుల్ సపోర్ట్‌గా ఉంది. ఆ ఓటు బ్యాంకు ఎటూ పోదనే ధీమా కూడా ఉంది. దానికి తోడు.. ట్రైబల్ ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకుంటే.. భవిష్యత్తులో రాజకీయాల్లో కీలకం కావచ్చునని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. ఎందుకంటే.. తెలుగు దేశం పార్టీకి సొంతం అనుకునే ఓటు బ్యాంకు ఎలాగూ జనసేన వైపు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి జగన్‌కు అండగా ఉంటున్న ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారు.
కేంద్రం నిధులతో అభివృద్ధి తన ఖాతాలోకి :
ఇక, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉన్నప్పటికీ.. ఆమెను కూడా పక్కన బెట్టి పవన్ కల్యాణ్ ఒక్కరే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గిరిజన గూడేల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రధానంగా ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు.
వైసీపీ వెంటే గిరిజనం :
ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే.. ఇప్పటి వరకూ గిరిజనులంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. 2019 ఎన్నికలనే చూసుకుంటే.. రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ వైసీపీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. ప్రధానంగా మన్యం ప్రాంతంలోని గిరిజనులు ఏ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటే.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల గిరిజనులు కూడా ఆ పార్టీకే మొగ్గు చూపుతారని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ.. మన్యంలోని గిరిజన ప్రాంతాలను తమవైపు తిప్పుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ ఓటు బ్యాంకు కూడా తనకు టర్న్ అవుతుందని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న జనసేన పార్టీ.. భవిష్యత్తులో ఏ తేడా వచ్చినా.. ఆ పార్టీని వదిలేసి.. సొంత ఓటు బ్యాంకు ద్వారా రాజకీయాలు చేయొచ్చన్న సుదూర వ్యూహంతో పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది.