- రాణాను అప్పగించేందుకు అమెరికా రెడీ
- నేరస్తుల అప్పగింత ఒప్పంద పత్రాల బదిలీ
- ఈ రాత్రికి లేదా రేపు ఉదయం భారత్ కు వచ్చే ఛాన్స్
- అది అంత సులభం కాదంటున్న మరికొన్ని వర్గాలు
- ముంబై 26/11 దాడుల సూత్రధారి రాణా
- చివరి నిమిషం వరకూ తప్పించుకునేందుకు నాటకాలు
ముంబై పేలుళ్ల ఘటనకు కీలక సూత్రధారి అయిన తహావుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసింది. ఈ రాత్రికి తహావుర్ ను భారత్ తీసుకొస్తున్నారు. లాస్ఏంజెలిస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ లో ఉన్న తహావుర్ రాణా తన అప్పగింతను అడ్డుకోడానికి చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 2025 ఫిబ్రవరి 27న దాఖలైన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో పెట్టాలని రాణా తరపున ఎమర్జెన్సీ దరఖాస్తు కూడా దాఖలు చేశాడు.
భారత్ కు చెందిన బహుళ విభాగాల బృందాలు ఇప్పటికే అమెరికా చేరుకుని పేపర్ వర్క్ పూర్తి చేస్తున్నాయి.అమెరికా అధికారులతో నేరస్తుని అప్పగింతకు సంబంధించిన అన్ని పత్రాలు క్లియర్ చేసుకుంటున్నారు. అయితే తహావుర్ రాణా అప్పగింతకు అవకాశాలు అంతంత మాత్రమేననే వాదనలూ వినిపిస్తున్నాయి. రాణా ఈరోజు భారత్ కు రాడని, అప్పగింత వ్యవహారం అంత సులభం కాదనీ విశ్వసనీయవర్గాల అంచనా.
తనను భారత్ కు అప్పగించవద్దంటూ రాణా చివరి నిమిషంలో దాఖలు చేసి పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాణాను అప్పగించడానికి లైన్ క్లియర్ చేసేసింది. ముంబై బాంబు పేలుళ్లలో ఎంతో మంది మరణానికి, విధ్వంసానికి కారకుడైన రాణాపై భారత్ సహా అమెరికా కూడా గుర్రుగానే ఉంది. 64 ఏళ్ల తహావుర్ తన అప్పగింతను అడ్డుకోవాలంటూ 2025 ఫిబ్రవరి 27న తహావుర్ పై భారత వర్గాలు దాఖలు చేసిన రిట్ హెబియస్ కార్పస్ లిటిగేషన్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో పెట్టాలని తహావుర్ తరపున ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఏప్రిల్ 4న విచారణ కూడా జరిగింది. అయితే సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించినట్లు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో ప్రకటించింది. తన అప్పగింతను అడ్డుకోవాలంటూ రాణా వేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసిందని జస్టిస్ కగాన్ తెలిపారు.దీంతో రాణాపెట్టుకున్న అన్ని రకాల పిటిషన్లు తిరస్కరణకు గురైనట్లే లెక్క.
తనను భారత్ కు అప్పగించడం అనేది అమెరికా చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమని తనను భారత్ కు తరలిస్తే చిత్రహింసలుపెట్టే అవకాశముందని రాణా ఆపిటిషన్ లో సందేహాలు వ్యక్తం చేశాడు..తాను పాకిస్థాన్కు చెందిన వాడు, అందులోనూ ముస్లిం కావడంతో, చిత్రహింసలు పెట్టే అవకాశం ఉందని రాణా తన పిటిషన్ లో భయాందోళనలు వ్యక్తం చేశాడు.ఒకవేళ తనను నిర్బంధించి బలవంతంగా అక్కడకు తీసుకెళ్లినా, తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా అది తనకి మరణ శిక్షను విధించినట్లే అవుతుందని రాణా తన దరఖాస్తులో పేర్కొన్నాడు.
అనేక జబ్బులతో బాధపడుతున్నరాణా
2024 జులై లోని మెడికల్ రికార్డ్స్ ప్రకారం రాణా రకరకాల ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్నాడు. అనేక మార్లు గుండె పోటు వచ్చిందని, పార్కిన్ సన్స్ డిసీజ్ వచ్చిందని, మతిమరుపు, చలనం కోల్పోయాడని, కిడ్నీ సంబంధిత, మూత్రనాళ సంబంధిత వ్యాధి మూడో దశలో ఉందని, దీనికి తోడు ఆస్త్మా వేధిస్తోందని తహావుర్ రాణా కోవిడ్ 19 సంబంధిత ఇన్ఫెక్షన్లతో ఇబ్బందులు పడుతున్నాడని తెలుస్తోంది. ఈపరిస్థితుల్లో తహావుర్ రాణా భారత్ కు వస్తే తానొక ముస్లిం అయినందున, పాకిస్థాన్ కు చెందిన వాడవడం వలనా తనపై చిత్రహింసలు ఎక్కువగా ఉంటాయని, ఆ చిత్రహింసలు చివరకు తన ప్రాణాలే పొగొట్టినా ఆశ్చర్యం లేదని తహావుర్ అమెరికా అధికారులకు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నాడు.తహావుర్ పాక్ ఆర్మీలో కూడా గతంలో పనిచేశాడు.
క్షమార్హం కాని వ్యక్తి… ట్రంప్
పాక్ సంతతికి చెందిన తహావుర్ కెనడా పౌరసత్వం కలిగిన వ్యక్తి. ముంబై 26/11 దాడులకు మూల కారకుడు. రాక్షసుడులాంటి రాణాను భారత్ కు విచారణకు అప్పగిస్తామని, తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2008 నాటి ముంబై బాంబు పేలుళ్లలో కనీసం 166 మంది చనిపోగా, అందులో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. ముంబైలో కీలక ప్రాంతాల్లో తిష్ట వేసి వీరంతా దాదాపు 60గంటల పాటు కాల్పులు జరిపారు.