- భారత్ తో యుద్ధానికి రెడీ అంటున్న పాక్
- సరిహద్దుల దగ్గర సైన్యం, ఆయుధాల మోహరింపు
- రెండు రోజుల నుంచి కవ్వింపు కాల్పులు, విన్యాసాలు
- యుద్ధ టాంకుల మోహరింపు..
- సింధు నది డ్యామ్ లు పేల్చేస్తాం
- అవసరమైతే 130 అణుబాంబులు ప్రయోగిస్తాం
- నీళ్లు ఆపితే సింధునదిలో పారేది రక్తమేనని బెదిరింపు
- భారత్ లో ఒక్కరి మాటకు పాక్ లో పది మంది రిప్లయ్
- పాకిస్థాన్ ది ఉత్తుత్తి హడావుడేనా?అటాక్ చేస్తుందా?
- యుద్ధం అస్సలు వద్దంటూ మాజీ ప్రధాని హితవు
మొరిగే కుక్క కరవదని సామెత..పాకిస్థాన్ వైఖరి ఏమిటి? ధైర్యంగా యుద్ధానికి దిగుతుందా? లేక సరిహద్దుల దగ్గర హడావుడితో సరిపెడుతుందా? ప్రస్తుతం ఇదే విషయాన్ని భారత అధికారులు చాలా నిశితంగా గమనిస్తున్నారు.పెహల్గాం ఉగ్ర దాడి పై విచారం వ్యక్తం చేయకపోగా ఉల్టా బెదిరింపులతో మాటల తూటాలు పేల్చింది పాకిస్థాన్. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తామన్న మన హెచ్చరికలకు బదులుగా పాకిస్థాన్ లో వంద గొంతులు పైకి లేచాయి. పాకిస్థాన్ జీవనాడి అయిన సింధు జలాలను ఆపేస్తామని మన దేశం బెదిరించగానే పాకిస్థాన్ వెర్రెక్కిపోయింది. నిప్పు తొక్కిన కోతిలా చెలరేగిపోయింది. తమ దగ్గర అణు బాంబులు ఉన్నాయని, తల్చుకుంటే భారత్ ను దెబ్బ తీయడం నిమిషాల్లో పని అనీ పాక్ మంత్రి ఒకరు నోరు పారేసుకున్నారు. భారత్ పై ఏకంగా 130 అణుబాంబులు గురిపెట్టి ఉంచామని నీళ్లు ఆపితే ఇక సమరమేననీ ఊగిపోయారు.సింధు నదిపై డ్యామ్ లను టెక్నికల్ బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. ఇక మాజీ ప్రధాని బేనజీర్ భుట్టొ కుమారుడు భిలావల్ భుట్టో అయితే సింధు జలాలను ఆపితే ఆ నదిలో పారేది నీళ్లు కాదని రక్తం ఏరులై పారుతుందనీ భారత్ ని హెచ్చరించారు.
బదులుకి బదులు..
ఇక పాక్ ప్రభుత్వం మీరు సింధు జలాలు ఆపితే మేం సిమ్లా ఒప్పందం రద్దు చేస్తాం అని ప్రకటించింది. అంతే కాదు ఎల్ ఓసీ దగ్గర తమ సైన్యాన్ని మోహరించి కవ్వింపు చర్యలకు తెగబడింది. తమ మిత్ర దేశాలకు ఫోన్లు చేసి మరీ మద్దతు కోరింది. పాకిస్థాన్ కోరిన వెంటనే చైనా భారత, పాక్ వివాదాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే భారత్ ఎవరినీ అడగకుండానే ప్రపంచ దేశాలు తమ మద్దతు ప్రకటించాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూరప్ సహా అన్ని దేశాలు భారత్ వెంట నిలిచాయి.తల్చుకుంటే అణు బాంబులతో భారత్ పనిపడతాం అంటూ పాక్ హెచ్చరికలు చేస్తే బదులుగా భారత్ అరేబియా సముద్ర జలాల్లో సైలంట్ గా అణు పరీక్ష జరిపి బదులిచ్చింది. ఇలా ప్రతీ విషయంలోనూ పాకిస్థాన్ నోరు పారేసుకుంటే మన దేశం చాలా నెమ్మదిగా, నర్మగర్భంగా అడుగులేస్తోంది.
పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు!!
యుద్ధమంటూ జరిగితే రెండు దేశాల మధ్య ప్రాణ, ఆస్తినష్టం తప్పదు. కానీ ఏ విధంగా చూసినా భారత్ ఆయుధ సత్తా ముందు పాకిస్థాన్ సైన్యం, బలగాలు దిగదుడుపే. భారత్ తో యుద్ధానికి సిద్ధమంటూ రంకెలేసిన పాకిస్థాన్ కు ఆదేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హితవు చెప్పారు. భారత్ తో పెట్టుకోవద్దని, ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి చర్చలే మంచిదని సూచించారు. పాక్ ప్రధాని షెహబాజ్ తో వ్యక్తిగతంగా భేటి అయిన ఆయన సోదరుడు నవాజ్ భారత సత్తాను తక్కువగా అంచనావేయొద్దని, ఆదేశంతో పెట్టుకుని కొరివితో తలగోక్కోవద్దని సూచన చేశారు. అన్న సూచనల మేరకు తమ్ముడు తలొగ్గుతాడా? తిరగబడతాడా చూడాలి.