తెలంగాణలో హాట్ టాపిక్‌గా ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం.. లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ గడువు ముగిసింది. అయితే ఇకపై కూడా ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు చెల్లించవచ్చని.. కాకపోతే రాయితీ వర్తించదని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కింద రూ.218 కోట్ల ఆదాయం సమకూరింది. ఇటీవల పెంచిన మూడు రోజుల గడువు కూడా ముగియడంతో ఇక నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులపై రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినా సరే.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. కొందరు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించి రెండు నెలలు గడిచినా ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో నెలల నుంచి ప్రొసీడింగ్స్ కోసం ఇంకా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికీ ఎల్1 అనుమతుల్లో జాప్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి గడువు ముగిసే వరకు హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు 70 వేల మందిపైనే రుసుము చెల్లించగా…కేవలం 4 వేల వరకు మాత్రమే ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రుసుము చెల్లించిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తొలుత క్షేత్రస్థాయిలో (ఎల్1 క్లియరెన్సు) పరిశీలిస్తారు.ప్రారంభంలో రెవెన్యూ నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇరిగేషన్ నుంచి ఏఈ, తర్వాత హెచ్‌ఎండీఏ నుంచి జేపీవో లేదా ఏపీవో పరిశీలించి నివేదికను అనుమతులకు పంపిస్తారు.
ఇప్పటికే ఎల్1 తనిఖీలు పూర్తయినా.. ప్రొసీడింగ్స్ ముందుకు కదలడం లేదు. ఇందు కోసం చాలామంది హెచ్‌ఎండీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫీజు చెల్లించిన వారందరికీ నెల రోజుల్లో ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.వాస్తవానికి ఎల్ఆర్ఎస్ గడువు.. మార్చి 31కే ముగిసింది. అయితే అప్పటికి కూడా చాలా మంది ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోవడంతో ప్రభుత్వం మరో గడువు ఇచ్చింది. ఏప్రిల్ 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంచారు. మేనెల ప్రారంభం నాటికి గడువు ముగిసినా.. ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు.
ప్రభుత్వం మరో 3 రోజులు ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు గడువు ముగియడంతో.. రాయితీ వర్తించదు.ప్రభుత్వం అధికారికంగా లేని లేఅవుట్లను అధికారికంగా మార్చేందుకు తెచ్చిన స్కీమే ఎల్ఆర్ఎస్. అలాంటి భూములు ఉన్నవారు.. ఆ భూములకు పక్కా లెక్కలు రాయించుకొని, వాటిని చట్టబద్ధంగా పొందుతారు. అలా పొందేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే.. అనగా 2020లో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది.