నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఆర్‌ఎంపీ క్లినిక్లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పరిధి దాటి వైద్యం చేస్తున్న కొందరు ఆర్‌ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. ఆర్‌ఎంపీ బోర్డుతో కొందరు ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స చేయాల్సిన వారు రోజుల తరబడి వచ్చీరాని వైద్యం చేస్తున్నారు. రోగి ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా వ్యవహరిస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఈ పరీక్షలు నిర్వహించినట్టు తేలితే కఠినశిక్షలు అనుభవించక తప్పదు. అందుకే వైద్యులు ఈ పరీక్షలు చేయడానికి నిరాకరిస్తుంటారు.
పుట్టబోయే బిడ్డ ఆడా..మగా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించడం నేరం. కొందరు అక్రమార్కులైన డాక్టర్లు దీన్నో ఆదాయవనరుగా చూస్తున్నారు. పుట్టబోయేది అమ్మాయి అని తేలితే కమిషన్లకు కక్కుర్తి పడి భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా పట్టణ కేంద్రం లింగ నిర్ధారణకు, అబార్షన్లకు కేరాఫ్ గా మారింది. ఆస్పత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధి చెందాయి. ఇటీవల తిరుమలగిరి సాగర్ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. కొంతమంది ఆర్‌ఎంపీలు మీడియేటర్లుగా ఉంటూ ఈ దందా సాగిస్తున్నారు.అబార్షన్ చేయటానికి ఒక్కొక్కరి నుంచి రూ.25వేలు వసూలు..లింగ నిర్ధారణ పరీక్షలు చేసి..అబార్షన్ సాగర్ నియోజకవర్గ హాలియా పట్టణ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు వైద్యులుగా కన్నా కమిషన్ ఏజెంట్లగానే ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఇక్కడ మరో దారుణం జరుగుతోంది. కొన్నిసార్లు స్కానింగ్లో అమ్మాయన్న విషయం స్పష్టంగా తేలకపోయినా…అబార్షన్ డబ్బుల కోసం గర్భస్థ శిశువు అమ్మాయే అని చెబుతున్నారు కొందరు వైద్యులు. అబార్షన్ పూర్తయ్యాక అసలు విషయం తెలిసినా తల్లిదండ్రులు ఏం చేయలేక తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు. ఆడపిల్లా? మగపిల్లాడా అని చెప్పటానికి కోడ్ లాంగ్వేజ్..అసలు లింగనిర్ధారణ చేయడం, ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా.. ఆర్‌ఎంపీల మధ్య వర్తిత్వం లేకుండా వచ్చే గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపినప్పటికీ పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అన్నది చెప్పరు. ఆర్‌ఎంపీ ద్వారా వస్తే మాత్రం పుట్టబోయేది ఎవరో తెలుసుకోవడం చిటికెలో పని.
ఎలాంటి వైద్య పరమైన రసీదులూ ఉండవు. పుట్టబోయేది ఎవరో తెలుసుకునేందుకు డాక్టర్లకు, రోగులకు మధ్య ఓ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. చిటికెనవేలు చూపిస్తే అబ్బాయని, రెండు వేళ్లు చూపిస్తే పాప అన్నది అక్కడికి వచ్చిన అందరికీ అర్ధమవుతుంది. ఆర్‌ఎంపీలు అనేకమంది ప్రయివేట్ ఆస్పత్రులకు కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రులపై అరకొర నిఘా వేస్తున్నారు. ‘దొరికితేనే దొంగ.. లేకపోతే దొర..’ అన్న చందాన ఈ దందా సాగుతోంది.
అమానుషాన్ని ఆపాల్సిన వైద్యారోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల దందాలో భాగం అవుతున్న ఆర్‌ఎంపీలకు చెక్ పెడితే అక్రమ అబార్షన్ అపడమే కాదు నకిలీ వైద్యుల ఆగడాలను అరికట్టవచ్చంటున్నారు. పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్‌ఎంపీ డాక్టర్లే. దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్‌ఎంపీలను నమ్ముతారు. కుటుంబంలో ఎవరికీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్‌ఎంపిల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తారు. అయితే ఆ గుడ్డి నమ్మకమే ఆర్‌ఎంపీ డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది.