26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

26 నుంచి రాష్ట్రంలో మరోసారి సంక్షేమ పండుగ -భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 26వ తేదీనుంచి మరోసారి సంక్షేమ పండుగ మొదలవుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ రోజు నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతాయని చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు.

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి మొదలుకానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లోనే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపిక చేస్తారని డిప్యూటీ సీఎం చెప్పారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని.. ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టత ఇచ్చారు. ప్రజా పాలనలో ప్రజలందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను తయారు చేస్తారని వెల్లడించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానన్నారు. ఎర్రుపాలెం మండలంలో ఉన్న చెరువులు అడవులను రక్షించుకుంటూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎర్రుపాలెం మండలంలో టూరిజం అభివృద్ధితో స్థానిక ప్రజల ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నదన్నారు భట్టి విక్రమార్క.

ఎకోటూరిజం అభివృద్ధిలో భాగంగా జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టామన్నారు. త్వరలోనే  ఇనీధ్రం, పేట చెరువులను ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతాల విశిష్టతను ఇంటర్నెట్‌లో పొందుపరిచి వీకెండ్ లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామాన్ని సెంటర్ పాయింట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. మాజీ మంత్రివర్యులు శీలం సిద్ధారెడ్డి గారు బనిగండ్లపాడుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ కాలేజీ తీసుకువచ్చి ఇక్కడి పేరు ప్రఖ్యాతలు తెచ్చారని స్మరించుకున్నారు. కట్టలేరు పై బ్రిడ్జి నిర్మాణం, మధిర రోడ్డు లింకు ఎర్రుపాలెం నుంచి రోడ్డు విస్తరణ చేసి బనిగండ్లపాడును సెంటర్ పాయింట్ గ్రామంగా మండలంలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను తయారుచేసుకొని ముందుకు పోతున్నామన్నారు.

బనిగండ్లపాడు లో నూతనంగా ప్రారంభించుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న 50 పడకల ఆసుపత్రి తో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఆ తర్వాత బనిగండ్లపాడు గ్రామంలో అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోడౌన్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com