ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి సౌదీ అరేబియాలో రష్యా, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు మొదలయ్యాయి. అయితే ఓ వైపు ఈ చర్చలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్, రష్యా పరస్పర దాడులు జరుపుకున్నాయి. రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై ఈ దాడులు జరిగాయి. ఇక ఉక్రెయిన్ చేసిన దాడుల్లో రష్యాలో ఇద్దరు మృతి చెందారు.
ఈ దాడుల ఎఫెక్ట్ చర్చలపై ఎలా చూపుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఈ దాడులు జరిగిన వెంటనే ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. రష్యాకు యుద్ధం ఆపడం ఇష్టం లేదు.. అందుకే తమ ఉద్దేశాన్ని చర్చల ముందు ఇలా దాడుల రూపంలో తెలిపిందంటూ విమర్శలు చేసింది.
రష్యా మొత్తం 147 డ్రోన్లను ప్రయోగించిందని.. ఇందులో 97 డ్రోన్లను కూల్చేశామని.. ఇక 25 టార్గెట్‌లను చేరుకోకుండా అడ్డుకున్నామని తెలిపింది ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్.
అయితే రష్యా కూడా ఉక్రెయిన్ తమపై దాడి చేసిందని ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. తాము 59 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్టు ప్రకటించింది. ఈ దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపింది.
ఇక చర్చల విషయానికి వస్తే.. ఉక్రెయిన్ కూడా ఈ చర్చల్లో భాగమవుతుంది. అయితే నేరుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా చర్చల్లో పాల్గొంటోంది ఉక్రెయిన్. ఇప్పటికే అమెరికాతో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. చర్చల్లో తమ వైపు నుంచి ఉండాల్సిన అంశాలను అమెరికాకు వివరించింది. మొదట బ్లాక్ సీపై ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదటగా అమలు చేయాలని సూచించింది ఉక్రెయిన్.
మొత్తానికి చర్చల సమయంలో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి ఉక్రెయిన్, రష్యాలు. కానీ స్టేట్‌మెంట్స్ మాత్రం అవతలి దేశమే తమపై దాడి చేసిందని చెబుతున్నాయి. ఈ వ్యవహారాలన్ని చూస్తే రెండు దేశాలకు ఈ చర్చలు జరగడం ఇష్టంగా లేనట్టు తెలుస్తోంది.