గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ విరుచుకపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగకపోవడం.. బందీలను విడుదల చేయకపోవడంతో మళ్లీ దాడుల ఉధృతిని పెంచింది ఇజ్రాయెల్. దీంతో రోజురోజుకు మృతులసంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 50 వేలు దాటిందని పాలస్తీనా ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు ఈ దాడుల్లో గాయపడ్డ వారి సంఖ్య కూడా లక్ష 13 వేలు దాటిందని ప్రకటించింది.
అయితే ఈ మృతుల సంఖ్యపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ తమ దాడుల్లో హమాస్ కీలకమైన ఇద్దరు నేతలను మాత్రం మట్టుపెట్టినట్టు తేల్చింది. సలాహ్ అల్ బర్దావీల్ అనే హమాస్ పొలిటికల్ వింగ్ కీలక నేతను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. ఇతను హమాస్ సీనియర్ నేత యాహ్యా సిన్వర్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా సిన్వర్ చనిపోయిన తర్వాత హమాస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అందుకే అతడిని టార్గెట్ చేస్తూ దాడి చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.
ఇక మరో హమస్ అగ్ర నేత ఇస్మాయిల్ బర్హౌమ్‌ను కూడా మట్టుపెట్టింది ఇజ్రాయెల్. అతడి మరణాన్ని పాలస్తీనా కూడ ధ్రువీకరించింది. అతను గాజాలో ఉన్న నాజర్ హాస్పిటల్‌లో తలదాచుకున్నాడన్న సమాచారంతో దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే ఈ దాడుల్లో అతను మృతి చెందడంతో పాటు.. భారీగా మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. ఈ హాస్పిటల్ నుంచే హమాస్ తన నెట్ వర్క్‌ను డెవలప్ చేస్తోందని చెబుతోంది.
అయితే ఈ దాడులను సమర్థించుకోంటోంది ఇజ్రాయెల్. తాము దాడులు ఆపితే.. హమాస్ మళ్లీ బలపడటానికే మొగ్గు చూపుతుందని.. అందుకే ఈ సంస్థను నిర్వీర్యం చేసేవరకు తమ దాడులు కొనసాగుతాయని చెబుతోంది. దీని కోసం ఇజ్రాయెల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజా నుంచి పాలస్తీనియన్లందరిని తరలించేందుకు కొత్త డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయబోతుంది. దీనికి ఆ దేశ మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ డైరెక్టరేట్.. గాజా నుంచి పాలస్తీనియన్లను తరలించే పనులను పర్యవేక్షిస్తోంది. మరి ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూడాలి.