పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి చర్చ మొదలయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చంద్రబాబు ప్రకటించడంతో పాటు.. వారానికోసారి సందర్శిస్తానని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయిస్తానని మొదట్లో పదే పదే చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా ఆ అంశం మరుగున పడింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం కూడా ఈ అంశంపై మరోసారి దృష్టి పెట్టింది. దీంతో, ఇప్పుడు మళ్లీ పోలవరం అంశం చర్చల్లోకి వచ్చింది. ఈనెల 27వ తేదీ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం వెళ్లనున్నారు.
పోలవరం వెళ్తున్న చంద్రబాబు.. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరంపై దృష్టి సారించింది . ఈ దఫా పూర్తయ్యే లోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఓ కొలిక్కి తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. గురువారం నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలవరంలో చంద్రబాబు పర్యటన సాగుతుంది.మరోవైపు ఇటీవల పార్లమెంట్లో పోలవరం నిర్మాణాన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి స్పష్టం చేశారు. గతంలో చాలా ప్రభుత్వాలు మారినా పోలవరానికి ఏమీ చేయలేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పోలవరం కోసం రూ.15 వేల కోట్లు కేటాయించారని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టం చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ.12 వేల కోట్లు కేటాయించారని వివరించారు. వచ్చే యేడాది కల్లా పోలవరం నిర్మాణాన్ని ఓ దరికి చేరుస్తామని లోక్ సభలో మంత్రి ప్రస్తావించారు.
పోలవరం పూర్తయితే సుమారు మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని 28 లక్షల మందికి పైగా ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని అదనంగా మరో 540 గ్రామాలకు శాశ్వతంగా త్రాగునీరు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటిదని ఎప్పటినుంచో చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏతో జట్టుకట్టిన క్రమంలో వీలైనన్ని ఎక్కువ నిధులను సాధించి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పోలవరం పర్యటనపై ఆసక్తి నెలకొంది.