28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

తెలంగాణ దీక్షా దివాస్ కు 15 ఏళ్లు

తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇదే రోజున కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇదే రోజున కేసీఆర్ అంకురార్పణ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపు అందుకుంటున్న దశలో ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. దీంతో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అంటూ ఆయన పంతం పట్టారు. ఆ రోజును పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ గా జరుపుకుంటున్నారు.

2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ఏర్పడింది. కేసీఆర్ ఉద్యమ వ్యాప్తి విస్తృతంగా చేశారు. ఉద్యోగుల సమ్మెలు, విద్యాలయాలు కదనరంగాలుగా మారాయి. ప్రజాసంఘాలు తమ పాత్ర పోషించాయి. కేసీఆర్ రాజకీయ ప్రక్రియ ద్వారా దేశంలో 36 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ఆధిపత్యవాద రాజకీయ పార్టీల చేత జై తెలంగాణ అనిపించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ఆకాంక్షలను మలిదశ ఉద్యమంలో రగిలించిన మహాశక్తిగా కేసీఆర్ నిలిచారు. నీళ్ళు నిధులు ఉద్యోగాల్లో జరిగిన దగాను చెప్పటమే గాక, తెలంగాణ ఆటపాట మాటలను ఎంత నిర్లక్ష్యం చేశారో కేసీఆర్ విప్పి చెప్పారు. తన నేలపై భాషా సంస్కృతులపై జరుగుతున్నదాడిని తిప్పికొడుతూ ఉద్యమం కన్నెర్ర జేసింది.

టీఆర్‌ఎస్ రాజకీయ ప్రక్రియ నేతృత్వంలో ఈ నేల మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకురావటంలో కేసీఆర్ ఎత్తుగడలు, చొరవ, వ్యూహాలు, ప్రతివ్యూహాలు సామాన్యమైనవి కావు. ఉద్యమబలాన్నంతా రాజకీయ ప్రక్రియగా మలిచి కేంద్రంపై ఒత్తిడి తేవటానికి టీఆర్ఎస్ బలమైన సాధనంగా పనిచేసింది. తెలంగాణ ప్రజల్లో ఉన్న పౌరుషాన్ని మండించటంలో కేసీఆర్ అగ్గిమంటై నిలిచారు. తెలంగాణ మహోన్నత సంకల్పాన్ని గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది ప్రజల సింహగర్జనగా, జనఘోషగా కేసీఆర్‌ మార్చగలిగారు. ఇదే టీఆర్ఎస్ బలానికి నిదర్శనంగా నిలిచింది. కేసీఆర్ అన్నికోణాల నుంచి ఉద్యమాన్ని రగిలించి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.

2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష మొత్తం తెలంగాణ సమాజాన్ని కదిలించింది. 29న సిద్దిపేటలో ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్టు చేయటంతో తెలంగాణ అట్టుడికిపోయింది. కేంద్రం కదిలిపోయింది. కేసీఆర్ తన మాటల్ని తూటాలుగా మార్చాడు. ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమ ప్రక్రియగా మలిచాడు. అమరుల త్యాగాలతో తెలంగాణ తల్లడిల్లుతుంటే కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రం కళ్లు తెరిపించాడు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన తెప్పించగలిగిన ధీశాలి, శక్తిమంతుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలంతా ఏదైతే కోరుతున్నారో దానికి టీఆర్ఎస్‌ను నాలుకగా మలిచిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com