28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ రద్దు?

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో నాడు.. అల్లు అర్జున్‌ థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చిన సమయంలో బన్నీ అభిమాని తొక్కిసలాటలో చనిపోయిన వ్యవహారం ఇప్పుడు సంధ్య థియేటర్‌ మెడకు చుట్టుకుంది. సంధ్య టాకీసుకు పోలీసులు నోటీసులు జారీచేశారు. థియేటర్‌ను ఎందుకు మూసేయొద్దో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

పుష్ప-2 సినిమా విడుదలైన సందర్భంగా ముందురోజు రాత్రి హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర బెనిఫిట్‌షో ప్రదర్శిస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాట వ్యవహారం ఆరోజు నుంచీ హాట్‌ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్‌ ఫస్ట్‌ షో సినిమా అభిమానులతో కలిసి చూసేందుకు తద్వారా హైప్‌ క్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్‌ టాకీసుకు వచ్చిన సమయంలో ర్యాలీ నిర్వహించడంతో.. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఆ మహిళ కుమారుడు ఇంకా చావుబతుకుల మధ్యే చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంపై అప్పుడే పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు కూడా. అయితే, అరెస్ట్‌ అయిన రోజే బెయిల్‌ రావడంతో అల్లు అర్జున్‌ జైలునుంచి విడుదలయ్యాడు. అంతటితో ఈ కేసు వ్యవహారం కనుమరుగవుతుందనుకున్నారు. కానీ, ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు సంథ్య థియేటర్‌ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. తొక్కిసలాట సంఘటనపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు. అంతేకాదు.. సినిమా థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో కూడా చెప్పాలని వివరణ అడిగారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే థియేటర్‌ మూసేస్తామని కూడా హెచ్చరించారు.

పోలీసులు జారీచేసిన నోటీసులోని ముఖ్య అంశాలు :

– థియేటర్‌లో నిర్వహణ లోపాలున్నాయి.
– సంధ్య 70MM, సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.
– రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2,520 మంది కూర్చునే సామర్థ్యం.
– ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.
– అనుమతి లేకుండా థియేటర్ బయట ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు ఒకేచోట పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు.
– అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.
– అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ విషయంలో సరైన ప్లాన్ చేయలేదు.
– అంత రద్దీలో కూడా అల్లు అర్జున్‌తో పాటు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.
– టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు. అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.

వాస్తవానికి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్‌. దశాబ్దాల నుంచి ఈ థియేటర్‌లో రిలీజ్‌ అయిన ప్రతీ పెద్ద సినిమా మొదటి దశలోనే ఆడుతుంది. సంధ్య థియేటర్‌లో మొదటిరోజు, మొదటి షో చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఆయా సినిమా హీరోల అభిమానులు ఇక్కడిదాకా వస్తారంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్‌ పుష్ప-2 సినిమా కూడా రిలీజ్‌తోనే సంధ్య థియేటర్‌లో షో వేశారు. అయితే, దురదృష్టవ శాత్తూ అనూహ్యరీతిలో తొక్కిసలాట జరిగింది. అనుకోని విషాదం చోటు చేసుకుంది. అయితే, ఇప్పుడు పోలీసులు ఏకంగా థియేటర్‌ ఎందుకు మూసివేయకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసు జారీచేయడం సంచలన అంశంగా మారింది. మరి, ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com