ప్రకృతిని దోపిడీ చేసి, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పౌరహక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక మంగళవారం నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ పాల్గొన్నారు. ఈ నెల 12న ఛత్తీస్ ఘడ్ ఆబూజ్ మడ్ లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆరోపించారు. ఆదివాసీలను అడవి నుండి దూరం చేసేందుకే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయన్నారు.
ఆదివాసులకు భూమిపై హక్కును రాజ్యాంగం కల్పించిందని… ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ ఘడ్ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. అడవి బిడ్డల ఉద్యమానికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని… అందుకే వారిని ఏరివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 మార్చ్ నాటికి మావోయిస్టు పార్టీని నిర్ములిస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే ప్రకటించారని గుర్తు చేశారు.
ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాస్తవాలను తెలుసుకొనేందుకు నిజనిర్దారణ కమిటీ నాయకులు వెళ్తే అనుమతించడం లేదని… విచారణలో ఎన్కౌంటర్ లన్నీ బూటకమే అని తెలుతాయన్నారు. అందుకే నిజనిర్దారణ కమిటీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆదివాసీ ప్రజలకు సంఘీభావంగా పౌర సమాజం అండగా నిలవాలని హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.