ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ వశమైన తొలి మున్సిపాలిటీగా నిడదవోలు నమోదయ్యింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన చేజిక్కించుకుంది. అయితే, జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా.. మున్సిపాలిటీని చేజిక్కించుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్ తనదైన వ్యూహంతో చక్రం తిప్పారు. ఫలితంగా ఒక్క కౌన్సిలర్ కూడా లేని నిడదవోలు మున్సిపాలిటీని జనసేన ఖాతాలో వేసుకున్నారు.
నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు, వారిలో జనసేనకు చెందిన ఒక కౌన్సిలర్ కూడా లేరు. గత ఎన్నికలలో 28 స్థానాల్లో 27 మంది వైఎస్‌ఆర్ సీసీ కౌన్సిలర్లు విజయం సాధించారు, 1 స్థానం టీడీపీకి దక్కింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కందుల దుర్గేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూటమి పొత్తులో భాగంగా రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తాజా పరిణామాల నేపథ్యంలో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇప్పుడు జనసేనకు చెందిన 14 మంది కౌన్సిలర్లతో పాటు.. ఒక టీడీపీ కౌన్సిలర్‌తో కలుపుకుంటే 15మంది జనసేనకు మద్దతు ఇచ్చారు. 15 మంది కౌన్సిలర్లకు తోడు.. మంత్రి కందుల దుర్గేష్ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉండటంతో ఒక్కసారిగా జనసేన బలం 16గా నమోదయ్యింది.
ఇన్నాళ్లు వైసీపీ అధీనంలో ఉన్న నిడదవోలు.. ఇప్పుడు కూటమి సర్కారులో భాగమైన జనసేన వశం కావడంతో.. అభివృద్ధిలో కూడా జోరందుకుంటుందన్న చర్చ మొదలయ్యింది. మరోవైపు.. ఇప్పటికైతే 14మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి జనసేనలో చేరగా.. మిగతా కౌన్సిలర్లు కూడా జనసేన వైపు రావొచ్చన్న చర్చ జరుగుతోంది.