భారత్‌పై దాడులు చేసిన ఉగ్రవాదులు, ఇక్కడ ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన నిందితులను వెనక్కి తీసుకురావడంతో కేంద్రం ఫోకస్ చేసింది. ఇప్పటికే ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌లో ఒకరైన తహవూర్ రాణాను అమెరికా నుంచి తీసుకొచ్చిన భారత్.. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ మోసంలో పారిపోయిన వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మోహుల్ చోక్సీ ఇప్పటికే బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. అక్కడి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న అతడిని లోకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రిక్వెస్ట్‌తో ఈ అరెస్ట్ జరిగింది. ముంబై కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్లను ఇప్పటికే జారీ చేసింది. నిజానికి ఏప్రిల్ 12నే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతడిని బెల్జియంలోని ఓ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. అతడికి బ్లడ్ క్యాన్సర్ ఉండటంతో చికిత్స కొనసాగుతోంది. అరెస్ట్ సమయంలో బెల్జియం నుంచి అతను స్విట్జర్లాండ్‌కు షిఫ్ట్ అయ్యే ప్రణాళికల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి 2024 సెప్టెంబర్‌లోనే అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ కోర్టు ముందు అతని తరపు న్యాయవాదులు భిన్నమైన వాదనలు వినిపించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు.. ట్రావెల్ చేయడానికి సిద్ధంగా లేడని తెలిపారు. అయితే అంటిగ్వా నుంచి బెల్జియంకు రాగా లేనిది.. భారత్‌కు రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని వాదించారు. దీంతో కోర్టు అంగీకరించి అతని అరెస్ట్‌కు అంగీకరించింది. కానీ అతడిని ఇప్పుడు భారత్‌కు డిపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్.
బెల్జియం కోర్టు అరెస్ట్‌కు మాత్రమే అంగీకరించింది కానీ.. డిపోర్ట్ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చోక్సీ ఇప్పుడు బెల్జియం కోర్టుల్లో న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది.ఈ కారణంగా అతడిని భారత్‌కు తీసుకురావడంలో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చోక్సీ అరెస్ట్ భారత్‌కు పెద్ద విజయం అంటున్నారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. పేదల సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారని.. ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారంటూ తెలిపారు.
చోక్సీ చేసిన నేరమేంటి?
దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపి పెట్టాడు చోక్సీ. రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్ చోక్సీ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం ఉంది. చోక్సీని భారత్‌కు రప్పించి విచారించాలని సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.