- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
- మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్
- ఈ కేసులో తొలి బెయిల్
- ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును భారత్‌కు అప్పగించే అవకాశం
- ట్రంప్ కొత్త నిర్ణయాలతో సులభతరమవుతుందంటున్న అధికారులు
- మూడు వారాల్లో ప్రభాకర్ రావును భారత్‌కు రప్పిస్తామంటున్న పోలీసులు
తెలంగాణలో సంచలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకుంది. గత పదేళ్లుగా వివిధ రాజకీయ నాయకులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఇతర ప్రముఖుల ఫోన్లను అప్పటి ప్రభుత్వ సహకారంతో కొందరు అధికారులు టాపింగ్ చేశారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి రెండు కీలక పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి.
ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో గడిపిన మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న బెయిల్ అనంతరం విడుదల కానున్నారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు చెరిపేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఆరెస్టైన తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉండగా తాజాగా ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేస్ లో అరెస్ట్ అయ్యిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్పీ భుజంగ రావ్, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. మిగతావారు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా తిరుపతన్నకు మాత్రమే సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
ఇది ఉండగా ఈ కేసులో మలో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను అమెరికా ప్రభుత్వం భారత్‌కు పంపించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెపుతున్నాయి. అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసుల్లో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అన్నీ అనుకున్నట్లుగా జరిగుతే వారం నుంచి మూడు వారాల్లో ఈ ఇద్దరినీ భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఒకవైపు తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ మరో ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టు కాబోతున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి. కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అరెస్టులు కూడా త్వరలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బిజెపి సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను కూడా టాప్ చేశారన్న ప్రచారాన్ని బిజెపి సీరియస్‌గా తీసుకుంది అవసరమైతే ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని కోరే అవకాశం ఉంది.