- మూడుసార్లకు మించి పదవుల్లేవ్
- ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా…
- సీనియర్లను సాగనంపేందుకే ప్లానా?
- తన టీమ్ సెట్ చేసుకుంటున్నాడా?
- నెట్టింట డిబేట్లు, చర్చలు
ఏపీలో రాజకీయాల మాటెలా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో జరిగే అంతర్గత రాజకీయాలు మాత్రం మంచి రసవత్తరంగా మారాయి. రోజుకొకరు, పూటకొకరు, గంటకొకరు మైకుల ముందుకొచ్చి ఏదేదో మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇక దావోస్ లో చంద్రబాబు టూర్ ఫెయిల్యూర్ కాలేదని, చాలా కంపెనీలు రాబోతున్నాయని గవర్నర్ చెప్పడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఎప్పుడో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట గందరగోళం సృష్టించింది. గత వైసీపీ ప్రభుత్వం దావోస్ వెళ్లి ఒకట్రెండు ప్రాజెక్టులతో వస్తే, పవన్ ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు వెళ్లి రిక్త హస్తాలతో వచ్చారు. అదే వీడియోని వారు పోస్ట్ చేశారు. జగన్ హయాంలో ఎలా ఉన్న ప్రస్తుత చంద్రబాబు, లోకేష్‌ల బృందం దావోస్ పర్యటనకు మాత్రం అప్పటి పవన్ కళ్యాణ్ వీడియో యాప్ట్ అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా ఇంకోవైపు వీకెండ్ కామెంట్స్ పేరుతో వచ్చే కథనాలు పార్టీని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న నారా లోకేష్ ఇప్పుడు పార్టీపై పట్టుకోసం పావులు కదుపుతున్నారు. ఈ మధ్య కాలంలో టీడీపీ పోలిట్ బ్యూరో ప్రక్షళన చేస్తారని విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనికి బలం చేకూర్చేలా విశాఖ పర్యటనలో నారా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ లోకేష్ ఏమన్నాడంటే… పార్టీ పదవులు మూడు టెర్మ్ లకు మించి చేయకూడదని తాను కూడా తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని పార్టీ వేదికపై చర్చించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెపుతానని కుండబద్దలు కొట్టారు. చాలామంది ఒకే పదవిని అంటిపెట్టుకుని ఏళ్ల తరబడి ఉంటున్నారు, దీనివల్ల ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముుకున్న వారికి అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా లోకేష్ అభిప్రాయపడ్డారు. అయితే పాలసీ డెసిషన్ పై చెప్పిన నాలుగు మాటలు ఖరాఖండీగానే చెప్పాడు.
ఇప్పుడు నెట్టింట దీనిపై పెద్ద డిబేట్లే నడుస్తున్నాయి. ఒక పార్టీ పదవిని మూడు టెర్మ్ లకు మించి చేయకూడదు, నేను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ అన్నాడు. అంటే దీనివెనుక ఉన్న ఉద్దేశాలను నెటిజన్లు చర్చిస్తున్నారు. ముందు చూపు లేకుండా లోకేష్ మాట్లాడాడా? పార్టీ పదవి అంటే కేవలం అంతర్గత పదవులే కాదు, సీఎం, మంత్రుల్లాంటి ప్రభుత్వ పదవులు కూడా వస్తాయని లాజిక్ లు తీస్తున్నారు.
సీం, డిప్యూటీ సీఎం పదవులు శాశ్వతం కాదు కదా, అవి ప్రభుత్వం ఉన్నంతవరకే ఉంటాయి. కాకపోతే అవి ముఖ్యమంత్రి తనకి నచ్చిన వారికి మాత్రమే ఇచ్చుకుంటాడని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే లోకేష్ చెప్పినట్టు పార్టీ పాలసీని మార్చితే, సీఎం, మంత్రుల పోస్టులే కాదు, అన్ని పదవులు కూడా మూడు సార్లకు మించి ఉండవని అనుకోవచ్చా? అని ప్రశ్నలు వేస్తున్నారు. అందువల్ల లోకేష్ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన నాలుగోసారి సీఎం అయ్యారు. మూడేసి సార్లకి మించి మంత్రి పదవులు అనుభవిస్తున్నవారు దిగిపోవాల్సి ఉంటుంది.
ఇకపోతే తెలుగుదేశం పార్టీలో అంతర్గత రాజకీయాలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పదవిలోకి వచ్చే ముందే పార్టీలో కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నట్టు బోధపడుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే చంద్రబాబు సమకాలీకులైన యనమల రామక్రష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లే కాదు, మంత్రులు నారాయణ లాంటి వాళ్లు సర్దుకోవల్సందే అంటున్నారు. నిజంగా లోకేష్ చెప్పినట్టు, నిర్ణయం తీసుకుంటే, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో ముప్పావు వంతు ఖాళీ అవుతుంది. దీంతో ఆ స్ధానాల్లో యువరక్తం పేరుతో లోకేష్ స్టంచ్ ఫాలోవర్స్‌ని పోలిట్‌బ్యూరోలోకి తీసుకుని పూర్తి స్ధాయిలో పార్టీపై పట్టు సాధించడానికే మూడు సార్లే పదవులు అనే కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారని పార్టీలో సీనియర్లు అంటున్నారు.