- మొన్న యోగీ, రాజ్ నాథ్ సింగ్
- ఇవాళ అమిత్ షా రాక పవిత్ర స్నానం ఆచరణ
- వచ్చే నెల 5న రానున్న మోడీ
- మరి మన సనాతనీలు వెళ్లెదెప్పుడు?
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాల జోరు కొనసాగుతోంది. రోజుకు కనీసం కోటి మంది పవిత్ర స్నానం చేసి పితృ తర్పణాలు వదులుతున్నారు. కేంద్ర మంత్రులు కూడా ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు. గతంలో రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం, ఆయన కేబినెట్ మొత్తం పవిత్ర స్నానాలు చేయగా తాజాగా హోం మంత్రి అమిత్ షా పవిత్ర స్నానం చేశారు. ప్రధాని మోడీ వచ్చే నెల 5వ తేదీన కుంభమేళాకు రానున్నారు. ఎంతో మంది తెలుగు వాళ్లు, సెలబ్రిటీలు కుంభమేళాకు వెళుతుంటే మన రాష్ట్రంలో సనాతనీలుగా చెప్పుకునే పెద్దలు, రాజకీయనేతలు మాత్రం ఇప్పటి దాకా కదల్లేదు.
సాధువులు, మఠాధిపతుల ఆధ్వర్యంలో స్నానం
త్రివేణి సంగమ స్థలికి విచ్చేసిన హోం మంత్రి సాధు సంతులు, మఠాధిపతులు, యోగి పుంగవుల సమక్షంలో మూడుసార్లు గంగా నదిలో మునిగారు. ఆపై సమీపంలోని ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఆరాళీ ఘాట్‌కు బోటులో చేరుకున్నారు. ఆయన వెంట యూపీ సీఎం యోగీ, ఇతర రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
ఎక్స్ లో అమిత్ షా కామెంట్
ప్రయాగ రాజ్ కు చేరుకునే ముందు అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో సనాతన సంస్కృతి నిరంతర ధారా స్రవంతికి ఒక చిహ్నం.. పవిత్ర ప్రయాగ్ రాజ్ లో గంగానదిలో మునిగి సాధు సంతుల ఆశీస్సులు తీసుకోడానికి తహతహలాడుతున్నాను. భిన్నత్వంలో ఏకత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం అంటూ పోస్ట్ చేశారు.
సుడిగాలి పర్యటన
పవిత్ర స్నానం అనంతరం బడే హనుమాజ్ జీ ఆలయాన్ని, అభయావత్ ఆలయాన్ని సందర్శించారు. ఆ పై జునా ఆఖాడాకు చేరుకుని అక్కడ మఠాధిపతులతో భోజనం చేశారు. అనంతరం శరణానంద స్వామీజీ ఆశ్రమానికి చేరుకుని అక్కడ గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. శృంగేరి, ద్వారక, పూరీ పీఠాధిపతులైన శంకరాచార్యులను కూడా సందర్శిస్తారు. కుంభమేళా జరుగుతున్నన్ని రోజులూ ఈ నాలుగు పీఠాలకు అధిపతి అయిన శంకరాచార్యులు అక్కడే ఉండటం విశేషం. యోగీ ఆదిత్యనాథ్ కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
తెలుగు నేతలకు తీరిక లేదా?
హిందూ సనాతన సంస్కృతికి అసలైన వారసులమని, సనాతన ధర్మానికి ఎవరైనా విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని తీవ్రమైన హెచ్చరికలు చేసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సనాతన వాదులెవరూ ఇప్పటి దాకా మహాకుంభమేళా కు వెళ్లినట్లు లేదు. సింగర్ మంగ్లీ లాంటి ఇతర సెలబ్రిటీలందరూ ఇప్పటికే అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు. కానీ మన సనాతనీలు మాత్రం ఇంకా కదలలేదు. మరో 28 రోజులుంది కాబట్టి ఈ లోగా వెళతారేమో చూడాలి.