గిగ్ వర్కర్లకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును త్వరితగతిన ప్రజల అభిప్రాయానికి అందుబాటులో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మందిరంలో జరిగిన సమావేశంలో గిగ్ వర్కర్లు, వారి యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ రూపొందించిన ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు’లో ఉన్న అంశాలను సీఎం రేవంత్ సమీక్షించారు.
బిల్లులో ఉన్న విషయాల్లో ముఖ్యమంత్రి పలు కీలక మార్పులను సూచించారు. కంపెనీలు, అగ్రిగేటర్లతో సుహృద్భావంగా వ్యవహరించే విధంగా చట్టం ఉండాలని, కార్మికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని రేవంత్ అధికారులకు సలహా ఇచచారు.
ప్రస్తుతం రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ప్యాకేజింగ్ సర్వీసుల్లో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని, అన్ని వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 25వ తేదీ నాటికి తుది ముసాయిదాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి, మే డే నాటికి బిల్లును అమల్లోకి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2023 డిసెంబర్ 30వ తేదీన గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఇది దేశంలో తొలిసారిగా చేపట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు. త్వరలో అమలు కానున్న కొత్త చట్టం కూడా దేశానికి తెలంగాణను మార్గదర్శకంగా నిలబెట్టాలని తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.