-
కల్వకుంట్ల ఫ్యామిలీలో పాలిటికల్ తుఫాన్
-
ప్లీనరీకి కవిత దూరమా?
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉన్న ప్రభావం ఏంటన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్రం వచ్చిన మొదట్లో తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్నంత స్థాయిలో హవా నడిపించుకున్నారు. వాళ్లింట్లోనే కేసీఆర్ సహా.. ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీ రోల్ పోషించారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మౌనంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్లీనరీ సన్నాహాలకు దూరంగా కవిత.. ఎందుకు?
ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా కొనసాగుతుండగా, కవిత మాత్రం ఏ కార్యక్రమానికీ హాజరు కావడం లేదు. గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న సన్నాహక సమావేశాలకు కూడా ఆమె దూరంగా ఉండటం గులాబీ క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది.
ఆహ్వానం అందలేదా? కావాలనే పక్కన పెట్టారా?
సిల్వర్ జూబ్లీ వేడుకలకు కవితకు ఆహ్వానం అందలేదా? లేక పార్టీ నాయకత్వమే ఆమెను పక్కన పెట్టిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కవిత, ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? పార్టీ నేతలతో సమావేశాల్లో కన్పించకపోవడం, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న కార్యక్రమాలకు ఆమె హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
‘జాగృతి’ పైనే దృష్టి?
కవిత ప్రస్తుతం ‘తెలంగాణ జాగృతి’ ద్వారా తన యాక్టివిటీస్‌ను ముమ్మరం చేశారు. మహిళలు, బీసీల అంశాలపై ఉద్యమాలు, 42% రిజర్వేషన్ల కోసం పోరాటం, ఫూలే విగ్రహ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలతో తరచూ కనిపిస్తున్నారు. అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు కోసం వామపక్షాల మద్దతును కూడగడుతున్నారు.
ఫ్యామిలీలో అంతర్గత పోరు?
ఇటీవలే కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నేతల సమావేశాలకు కవిత హాజరుకాకపోవడం, తన సొంత జిల్లా నిజామాబాద్‌లో జరిగే సమావేశాలకు కూడా దూరంగా ఉండటం చర్చను లేవనెత్తుతోంది. తనకు పార్టీలో ముఖ్య పదవి ఇవ్వాలని తండ్రిని ఎంతగా బతిమిలాడినా ఇవ్వడం లేదని, అందుకే కుటుంబంలో కలహాలు చెలరేగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేటీఆర్ స్థాయి పదవి కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ, తన ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఇప్పట్లో లేదని గ్రహించే కవిత ప్లీనరీకి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అటు.. కేసీఆర్ కూడా కవితకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది సొంత పార్టీ నేతల మాట.
మొత్తంగా చూస్తే.. కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు భవిష్యత్‌లో బీఆర్‌ఎస్ పార్టీపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.