ప్రఖ్యాత సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం స్వర్ణ దేవాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ విద్య, ఐటీ, ఆర్‌టీజీ శాఖా మంత్రి నారా లోకేష్ సందర్శించారు. నారా లోకేష్ కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు లోకేష్.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అందరి సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించానని చెప్పారు. స్వర్ణ దేవాలయ సందర్శన మహా భాగ్యంగా భావిస్తున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఆదివారం ఉదయం అమృత్‌సర్‌కు చేరుకున్న లోకేష్, ఆయన కుటుంబ సభ్యులు, అత్యంత పవిత్రమైన శ్రీ హర్మందిర్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. సిక్కుల మత విశ్వాసాల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
స్వర్ణ దేవాలయం ఆవరణలో గడిపినంత సేపు తనకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించిందని లోకేష్ తెలిపారు. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించే అవకాశం లభించడం సంతోషకరమైన విషయం అని తెలిపారు.
స్వర్ణ దేవాలయానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ దేవాలయంలోని పలు ప్రత్యేకమైన ప్రాంతాలను సందర్శించారు. స్వర్ణ దేవాలయం ఆవరణ లోని కొలను, లంగర్‌ను దర్శించి గురుద్వారా సేవను ఆస్వాదించారు. దేవాలయ పరిసరాల్లో శాంతి, భక్తి భావాన్ని ఆస్వాదించిన మంత్రి ఈ పుణ్యక్షేత్రం ఎంతో గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం సందర్శన ద్వారా తనకు మరింత మానసిక స్థైర్యం లభించిందన్నారు. ఇలాంటి పవిత్ర ప్రదేశాలు అందరికీ శాంతిని అందిస్తాయని లోకేష్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు లోకేష్ తెలిపారు.