39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌?

  • మహానాడులో ప్రకటన చేసే అవకాశం

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరుగనున్న మహానాడు వేడుకల్లో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పసుపు పార్టీ ఉత్సాహంలో ఉంది. ఈ విజయోత్సవాన్ని మహానాడు రూపంలో ఘనంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సార్లు మహానాడు జరిగినా, ఈసారి తొలిసారిగా వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించనుండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇదే నేపథ్యంలో మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు నాయుడు 75 యేళ్ల వయస్సులోకి అడుగుపెట్టిన ఈ తరుణంలో, పార్టీలో యువ నేతలకు పెద్దపీట వేయాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్‌ను టిడిపి పగ్గాలు చేపట్టే స్థాయికి ప్రోత్సహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గతంలో లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వచ్చినప్పుడు, జనసేన నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ దృష్ట్యా పార్టీలో అధికారికంగా ప్రకటనలు జారీ చేసి, ఇకపై ఇటువంటి విషయాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని నేతలతో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం అంశం తాత్కాలికంగా పక్కకు వెళ్లిపోయింది. అయితే, ఇప్పుడు లోకేష్‌కు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించాలన్న డిమాండ్ జోరుగా ఉంది.

ప్రస్తుతం చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నా, రాష్ట్ర అధ్యక్ష పదవికి మరో నేత ఉన్నారు. ఇప్పుడు లోకేష్‌కు పదోన్నతి ఇవ్వాలంటే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాల్సి ఉంటుంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా పూర్తిస్థాయి బాధ్యతలు కలిగి ఉండదన్న అభిప్రాయంతో, ఆయనకు ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న సూచనలు ఉధృతంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ, లోకేష్‌కు పగ్గాలు అప్పగిస్తే, అది పార్టీలో కొత్త ఉత్సాహం నింపుతుందన్నది టీడీపీ వర్గాల భావన.

లోకేష్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నియోజకవర్గంలోనే ఈసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి పార్టీ శ్రేణులను ఆకట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఆయనకు ఇప్పుడు పార్టీలో పదోన్నతి ఇవ్వడం ద్వారా అధికారంలోనూ మరింత స్థానం కల్పించే అవకాశముంది. మహానాడు వేదికగా లోకేష్ భవిష్యత్తు గురించి తుదినిర్ణయం వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో, పార్టీ విధానాలపై పలు తీర్మానాలు తీసుకునే ఈ మహానాడు సభ, తెలుగుదేశం భవిష్యత్ దిశను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com