హైదరాబాద్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి సాగులో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నీళ్లు లేకపోయినా కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాలను అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) అభివృద్ధి చేసిన ‘ధన్ 100’ అనే వరి రకం సాంప్రదాయ వరిలోకంటే సుమారు 30 శాతం అధిక దిగుబడిని ఇస్తుందని సైంటిస్టులు తెలిపారు. ‘పూసా రైస్ డీఎస్‌టీ1’గా పిలిచే ఈ వంగడాన్ని ముఖ్యంగా కరువు, అధిక ఉష్ణోగ్రతలలోనూ సాగు చేయవచ్చని వివరించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వరి రకం సుమారు 20 రోజులు ముందుగానే చేతికొస్తుంది. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా మారనుందంటున్నారు.
ఈ వంగడాలను అత్యాధునిక ‘క్రిస్పర్–కాస్9’ జీనోమ్ ఎడిటింగ్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన రెండు కొత్త వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఆవిష్కరించారు. ఇవి ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలుగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య కూడా ఈ వంగడాలు నిలదొక్కుకుంటాయని చెప్పారు.
దేశంలో ప్రసిద్ధమైన ‘సాంబ మసూరి’ వంగడానికి జన్యు సవరణ చేసి ‘ధన్ 100 (కమల)’ అనే కొత్త రకాన్ని రూపొందించామని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘క్రిస్పర్’ సాంకేతికతను ఉపయోగించి, సాంబ మసూరిలోని ‘సైటోకినిన్ ఆక్సిడేస్’ అనే జన్యువులో మార్పులు చేసామన్నారు. ఈ పరిశోధన ప్రక్రియకు సుమారు మూడు సంవత్సరాలు పట్టిందనీ, ఇందులో రెండేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించామన్నారు.
ప్రస్తుతం ఈ కొత్త రకం వరికి సంబంధించిన మూల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, వాటి విడుదల కోసం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఎదురు చూస్తున్నామని తెలిపారు. సుమారు 19 శాతం దిగుబడి పెరుగుదలతో పాటు, ఈ వరి రకం కండలు బలంగా ఉండటం వల్ల కరువులను తట్టుకుని నిలబడగలదని వివరించారు.