నందమూరి మోక్షజ్ఞకి హెల్త్ బాగలేకపోవడంతో ఈ రోజు జరగాల్సిన షూటింగ్ ఆగిపోయింది. చిత్ర పరిశ్రమలోకి మోక్షజ్ఞ ఎంట్రీని బాలయ్య చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోగా.. దానికి ఆదిలోనే హంసపాదు పడినట్టు అయింది. మోక్షజ్ఞ తొలి చిత్రం ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో డిసెంబర్ 5న (గురువారం) ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ కార్యక్రమం ఆగిపోవడానికి మొదట ఆరోగ్య కారణాలని చెప్పినా.. తర్వాత ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
చివరి నిమిషంలో ఈ ముహూర్తం వాయిదా పడటానికి కారణం మోక్షజ్ఞ అనారోగ్యంగా ఉన్నాడని తెలిసింది. మోక్షజ్ఞ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మకి చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సినిమేటిక్ యూనివర్స్( PVCU ), జై హనుమాన్, అధీర, ప్రభాస్ సినిమా ఇలా పలు ప్రాజెక్ట్స్ ఆయన చేయాల్సి ఉండటంతో ఈ సినిమా విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశాంత్ ని అడగటంతో మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడు. కానీ.. చివరికి ఏమవుతుందో తెలియాల్సి ఉంది.
ఈ వేడుకకు ఏపీ మినిస్టర్, బాలయ్య అల్లుడు మంత్రి నారా లోకేష్, ఎంపి భరత్ తదితరులు రాబోతున్నారని ప్రచారం జరిగింది. హఠాత్తుగా వాయిదా వేయడంపై సినీఅభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రామానాయుడు స్టూడియోలో సెట్ కోసం 30 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. మళ్లీ ముహూర్తం ఎప్పుడు ఉంటుందో అని చర్చ జరుగుతోంది.
మరోవైపు మోక్షజ్ఞ.. వెంకీ అట్లూరి, ఆదిత్య 999 ప్రాజెక్టులకి ఓకే చెప్పాడు. త్వరలోనే మంచి రోజు చూసి మోక్షజ్ఞ సినిమా ప్రారంభం చేస్తామని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలకృష్ణ తన సూపర్ హిట్ మూవీ ఆదిత్య 369కి సీక్వెల్‌ను మోక్షజ్ఞతో చేయబోతున్నారు. బాలయ్య దర్శకత్వం వహించడంతో పాటు తాను సైతం ఆ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు.