ఎంపీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారి జీతాన్ని 24 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎంపీలకు నెలకు లక్ష రూపాయల జీతం ఉండగా.. ఇకపై లక్షా 24 వేల రూపాయల జీతాన్ని అందుకోబోతున్నారు ఎంపీలు. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల జీతాన్ని పెంచినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన గెజిట్ కూడా వచ్చేసింది.
కేవలం జీతం మాత్రమే కాదు. సిట్టింగ్ సభ్యుల దినసరి భత్యం కూడా రూ2 వేల నుంచి రూ.2,500కు పెంచింది కేంద్రం. మాజీ ఎంపీల పెన్షన్‌ను కూడా రూ.25,000 నుంచి రూ.31,000కు పెరిగింది. అలాగే ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది సర్వీస్‌కు అదనపు పెన్షన్‌ను నెలకు రూ.2 వేల నుంచి రూ.2,000కు పెంచారు. ఇందులో మరో హైలేట్ ఏంటంటే.. ఈ పెరిగిన జీతాలను 2023 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. సో.. ఏప్రిల్ ఒకటిన ఎంపీలు పొందే జీతాలు భారీగా ఉండనున్నాయి.
గతంలో 2018 ఏప్రిల్‌లో సిట్టింగ్, మాజీ ఎంపీలకు జీతాలు, అలవెన్స్‌లు పెంచారు. అప్పుడే ఎంపీల జీతం నెలకు లక్ష రూపాయలైంది. వేతనాలకు అదనంగా నియోజకవర్గ అలవెన్స్, ఆఫీస్ అలవెన్స్ కూడా అందుతుంది. ఇవే కాకుండా ఫోన్, ఇంటర్నెట్ బిల్లుల కోసం అలవెన్స్‌లు అందుతాయి. కుటుంబసభ్యులతో కలిసి ఏడాదికి 34 ఉచితంగా దేశంలో విమాన ప్రయాణాలు చేయవచ్చు. ఇక రైలులో ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేయవచ్చు. అంతేకాదు రోడ్డు మార్గంలో వెళితే మైలెజ్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏడాదికి 50 వేల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా పొందుతారు.
అయితే ఇప్పటికీ కూడా జీతాలను ఎక్కువగా తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల్లో కర్ణాటక నేతలే ఉన్నారని చెప్పాలి. రీసెంట్‌గా వారీ జీతాలను వందశాతం పెంచుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జీతం రూ.75,000 నుంచి రూ.1.5 లక్షలకు చేరింది. సభ్యుల జీతాలు కూడా రూ.40,000 నుంచి రూ.80,000కు పెరగనున్నాయి.