ఐపీఎల్‌లో మరో నరాలు తెగె ఉత్కంఠ మ్యాచ్‌కు వేదికైంది వైజాగ్. లక్నో, ఢిల్లీ మధ్య మ్యాచ్ ఆఖరి బాల్ వరకు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. అశుతోష్ షర్మ పుణ్యమా అని ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించింది. భారీ స్కోర్ చేసినా లక్నోకు ఓటమి తప్పలేదు.
210 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఢిల్లీకి అన్ని షాక్‌లే తగిలాయని చెప్పాలి. శార్థూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ వరుసగా వికెట్లు తీశారు. 2 పరుగులకే 2 వికట్లు.. 7 పరుగుల వద్ద మూడో వికెట్.. 50 పరుగుల వద్ద నాలుగో వికెట్.. 65 పరుగుల వద్ద ఐదో వికెట్లు.. ఇలా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది ఢిల్లీ. దీంతో ఇక మ్యాచ్‌ను ఢిల్లీ గెలిచే అవకాశమే లేదనుకునే సమయంలో క్రీజులోకి వచ్చారు అశుతోష్, విప్రజ్. వీరిద్దరి ఆటతో ఢిల్లీ డగౌట్‌లో మళ్లీ గెలుపు ఆశలు చిగురించాయి. అయితే నిగమ్ కూడా దిగ్వేష్‌కు దొరికిపోవడంతో.. ఇక మ్యాచ్ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు అశుతోష్. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. ఆఖరిబాల్ వరకు క్రీజులోనే ఉండి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఢిల్లీ గెలవాలంటే ఆఖరి 7 ఓవర్లలో ఏకంగా 93 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మ్యాచ్‌ను టర్న్ చేసింది ప్రిన్స్ యాదవ్ వేసిన 16వ ఓవర్. ఈ ఓవర్‌లో అశుతోష్ ఓ ఫోర్, ఓ సిక్స్ బాదగా.. విప్రజ్ కూడా రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో మ్యాచ్ టర్న్ అయింది. అయితే 17వ ఓవర్‌లో విప్రజ్ ఔట్‌తో మళ్లీ డైలమాలో పడింది. కానీ ఇన్నింగ్స్‌లో పాతుకుపోయి అశుతోష్ ఢిల్లీని గెలుపు తీరాలకు చేర్చాడు.
నిజానికి లక్నో కూడా చాలా ధాటిగా ఆడిందనే చెప్పాలి. మార్ష్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఎందుకంటే లక్నో టోటల్ స్కోర్ 209 పరుగులు అయితే.. అందులో వీరిద్దరి స్కోరే 147. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్లు ఎంత ధాటిగా ఆడారో. మార్ష్ జస్ట్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
పంత్ స్టంప్ మిస్.. మ్యాచ్ ఫట్..
నిజానికి ఈ మ్యాచ్‌లో లక్నో గెలిచేదే. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలవాలంటే ఆరు పరుగులు చేయాల్సి ఉంది. షాబాజ్ వేసిన బాల్‌ను క్రీజులో ఉన్న మోహిత్ శర్మ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి భారీ షాట్ ఆడాలనుకున్నాడు. అయితే ఇది కాస్త బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్లవైపు వచ్చింది. ఈ బాల్‌ను పంత్ కనుక క్యాచ్ చేసి ఉంటే స్టంపౌట్ చేసేవాడు పంత్. దీంతో గెలుపు లక్నోదే అయ్యేది. కానీ బాల్ మిస్ అయ్యింది.. మ్యాచ్ కూడా మిస్ అయ్యింది. అయితే ఆటలో ఇవన్నీ సహజం.. పట్టించుకోవద్దు అన్నాడు పంత్.