దేశంలొని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. విశాఖలో రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని అన్నారు.
దేశంలో ప్రజలు ఎన్టీఏను నమ్మారు, మోదీని నమ్మారు, వారి పరిపాలనా సామర్థ్యాన్ని నమ్మారు…అందుకే ముచ్చటగా మూడోసారి పట్టం కట్టారని అన్నారు. మోదీ ఎప్పుడూ చెప్పే మాటేమిటంటే ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి. ఏదైనా జరగని, అధైర్యం మాత్రం పడవద్దనే అంటారు. అలాంటి ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరిలో నింపితే, అది పటిష్ట భారత్‌గా మారుతుందని అన్నారు.
ఒక గొప్ప సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిస్తే.. అది స్వచ్ఛ భారత్ అవుతుందని తెలిపారు. ప్రధాని చెబుతున్నట్టు ప్రతి ఒక్కరిలో సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. బలమైన భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని, నిరంతరం తపిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు విశాఖలో శంకుస్థాపనలు చేసిన పనులు పూర్తయితే, దాదాపు 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. నిరుద్యోగ సమస్య సగం తీరుతుందని అన్నారు. ఏపీలో గత ఐదేళ్లలో అవినీతి, అరాచక పాలన కొనసాగిందని అన్నారు. అవన్నీ చక్కబెట్టి, సరిచేసి రావల్సి వస్తోందని తెలిపారు. అన్నింటికి మించి సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు.