ప్రపంచంలోనే విశిష్ట స్థానం ఉన్న ఐటీ టెక్నాలజీకి, నేటి నుంచి ఏపీ ప్రధాన కేంద్రంగా మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలో రూ. 2 లక్షల కోట్లతో అభివ్రద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఎంతో విజనరీ ఉన్న సీఎం చంద్రబాబుకి ఐటీపై ఎనలేని పట్టు ఉందని అన్నారు. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో క్రిస్ సిటీ భాగమవుతుందని అన్నారు. ఇప్పటికే శ్రీ సిటీ ద్వారా ఏపీలో తయారీ రంగం అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు.
ఆంధ్ర ప్రజలకు తమపై ఎంతో అభిమానం ఉందని, అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు రావడంతో ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించారు. అదే ఉత్సాహంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం చంద్రబాబు తన స్పీచ్‌తో సిక్సర్ కొట్టారని కొనియాడారు. అన్నింటికన్నా మించి 60 ఏళ్లలో మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించిందని అన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదమేనని, అందరికీ రెండు చేతులెత్తి నమస్కరించారు.
ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు. 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నేటి ప్రాజెక్టులు రేపటి ఆంధ్ర వికాశానికి తోడ్పడతాయని అన్నారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రో జన్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్ లు వస్తుంటే, అందులో ఒకటి విశాఖకు కేటాయించామని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు. ఇది వచ్చింతర్వాత ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు.
బల్క్ డ్రగ్ పార్కులో దేశంలో మూడు మాత్రమే వస్తుంటే, ఒకటి నక్కపల్లిలో శంకుస్థాపన చేశామని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ప్రధాని తెలిపారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయం, పర్యాటక రంగం అభివృద్ధి పథంలో సాగుతాయని అన్నారు.
ఇప్పటికే ఏపీలో ఏడు వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయని తెలిపారు. అమ్రత్ భారత్ కింద రాష్ట్రంలో 70 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని అన్నారు. రాబోవు రోజుల్లో ఏపీకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య తెలిపారు.
సభలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పురంధేశ్వరి, మంత్రులు లోకేశ్, అనిత, విశాఖ ఎంపీ భరత్, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.