మోదీ సర్కారు మరో ముందడుగు వేసింది. వక్ఫ్ బోర్డు బిల్లు కూడా సాధించింది. పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. ఇక చట్టరూపంలో వక్ఫ్ బిల్లు అమల్లోకి రావడమే మిగిలింది.
ఎట్టకేలకు సునాయాసంగా రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. వక్ఫ్ బోర్డుకు అపరిమితంగా అమలవుతోన్న అధికారాలను నియంత్రించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చట్టం 1995కు సవరణలు చేరుస్తూ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. బుధవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ మరుసటిరోజు అంటే.. గురువారం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రాజ్యసభలో కూడా సుదీర్ఘంగా ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం ఎట్టకేలకు ఎగువ సభలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 రాజ్యసభలో చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత ఓటింగ్‌కు పెట్టారు. సుమారు 14 గంటల పాటు సాగిన వాదనలు మరియు చర్చల అనంతరం, 2025 ఏప్రిల్ 4వ తేదీ తెల్లవారుజామున ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుపై చర్చ జరిగిన సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటే దాకా సభ కొనసాగింది. చర్చ పూర్తయిన తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది.
పై పరిణామాల నేపథ్యంలో అధికార, విపక్షాకు చెందిన సభ్యుల వాదనల మధ్య వక్ఫ్ బిల్లు-2025కు పార్లమెంటు ఆమోదం లభించింది. అంతకుముందు ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చిన తర్వాత రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 128 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. గురువారం అర్ధరాత్రి వరకు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. అయితే, ప్రతిపక్షాలు ఈ బిల్లుకు సంబంధించి చేసిన సవరణలను రాజ్య సభ తిరస్కరించింది.
తొలుత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరచడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ సవరణ బిల్లు ఉద్దేశించిందని రిజిజు చెప్పారు. ఇది ముస్లింలకు వ్యతిరేకం అసలే కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మంత్రి అన్నారు. సంక్లిష్టతలను తొలగించడం, పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను ఉపయోగించి వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరచడం ఈ సవరణ బిల్లు ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మతంతో సంబంధం లేదన్నారు. అన్ని వర్గాల ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తీసుకు రానున్నట్లు మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగాయని మంత్రి రిజిజు సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాలను పూర్తి చేయడానికే ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విపక్షాలను కోరారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి రిజిజు ఖండించారు. ముస్లింల హక్కులను ఈ బిల్లు ఏమాత్రం హరించదని స్పష్టం చేశారు. షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు కూడా వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనల్లో చేర్చామని మంత్రి చెప్పారు. మొత్తం 22 మంది సభ్యులతో ఏర్పడనున్న సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై తలెత్తుతున్న సందేహాలకు రిజిజు సమాధానం ఇచ్చారు. ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదని మంత్రి స్పష్టం చేశారు.
రాజ్యసభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని అంతకు ముందురోజే ప్రకటించిన బిజూ జనతా దళ్ పార్టీ (బీజేడీ) మరుసటి రోజుకు యూటర్న్ తీసుకుంది. రాజ్యసభలో ఓటింగ్ జరగడానికి ముందు గేట్లు తెరిచింది. తమ ఎంపీలకు విప్ జారీచేయలేదు కానీ, తమ పార్టీ ఎంపీలు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని పేర్కొంది. కానీ, రాజ్యసభలో బీజేడీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
అటు, వైఎస్ఆర్సీపీ సైతం బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ.. తమ ఎంపీలకు విప్ జారీచేయకపోవడం గమనార్హం. ఆ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు సభ్యలు ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్, అన్నాడీఎంకే, బీఎస్పీలు విప్ జారీచేయలేదు. ఇక, అధికార ఎన్డీయేకు రాజ్యసభలో మంది 125 సంఖ్యా బలం ఉంటే.. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు వచ్చాయి. అంటే అదనంగా ముగ్గురు ఓటేశారు. దీంతో బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఆ ముగ్గురు ఎవరు? అనేది తెలియ రాలేదు.
ఇక, ఇండియా కూటమిలో చూస్తే.. ఆ కూటమిలో కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన (యూబీటీ), వామపక్షాలు, టీఎంసీ సహా 95 మంది సభ్యులు వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 252 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం 236 మంది ఉన్నారు. గురువారం 223 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 13 మంది సభకు రాలేదు. ఈ 13 మంది ఎవరు? ఏ పార్టీ సభ్యులు అనేది తెలియాల్సి ఉంది. విప్ జారీచేయని పార్టీలకు చెందిన సభ్యులు అయి ఉంటారని భావిస్తున్నారు. వీరిలో తెలుగు దేశం పార్టీ నుంచి కూడా ఒక సభ్యుడు హాజరు కాలేదన్న చర్చ జరుగుతోంది.
ఓట్ల మధ్య భారీగా తేడా ఉండటానికి కారణాలు :
ప్రభుత్వ బలమైన స్థానం :
కేంద్రంలో అధికారంలో ఉన్న NDA కూటమి రాజ్యసభలో కూడా బలమైన స్థానంలో ఉంది. దీంతో, తమకు మద్దతుగా ఉన్న పార్టీల ఓట్లతో బిల్లును సులభంగా ఆమోదింపజేసుకోగలిగింది.
ప్రాంతాయ పార్టీల మద్దతు :
కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లులోని సంస్కరణలను సమర్థించాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు లభించాయి. వైసీపీ వంటి పార్టీలు పైకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ.. విప్ జారీచెయ్యకుండా క్రాస్ ఓటింగ్ చేయడంతో రాజ్యసభలో సులభంగా వక్ఫ్ బిల్లు పాస్ అయ్యింది.
సంస్కరణల అవసరం :
వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ బిల్లు అవసరమని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనను చాలామంది సభ్యులు సమర్థించారు.
మైనారిటీల సంక్షేమం :
ఈ బిల్లు మైనారిటీల సంక్షేమానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్పడం వలన కూడా ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలిపారు.
విపక్షాల వాదనలు :
అయితే, ప్రతిపక్షాలు ఈ బిల్లును “ముస్లిం వ్యతిరేక” మరియు “రాజ్యాంగ విరుద్ధం” అని విమర్శించాయి. కానీ, వారి వాదనలను మెజారిటీ సభ్యులు ఓటింగులో అంగీకరించలేదు.