26.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది… ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

రాజమహేంద్రవరంలో ఆత్మహత్యా యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి వైద్య చికిత్స పొందుతూ12 రోజుల తర్వాత దుర్మరణం పాలవ్వడానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వరుదు కళ్యాణి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్‌ పనిచేస్తున్న ఆసుపత్రిలో అంజలికి చికిత్స చేయించద్దని వేరే ఆసుపత్రికి తరలించాలని ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నా ప్రభుత్వం తరపు నుంచి ఎవరూ పరామార్శకు కూడా రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నరరూప రాక్షసుడి వేధింపులకు ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి అసువులు బాసిందని, ఆమె ఆత్మహత్యకు కిమ్స్‌ ఏజీఎం దీపక్‌ కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయడం లేదని విమర్శించారు. ఏ ఆస్పత్రిలో అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసిందో అదే ఆస్పత్రిలో వైద్యం అందిస్తే ఎలా న్యాయం చేసినట్టు అవుతుందని ఎమ్మెల్సీ. నిందితుడు దీపక్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందు వల్లే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వరుదు కళ్యాణి ఆరోపించారు.

గత నెల 23న అంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపానపోలేదని వరుదు కళ్యాణి అన్నారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే అదే వారికి ఆఖరి రోజు అని చంద్రబాబు, ఆడబిడ్డల మీద కన్నెత్తి చూస్తే తాట తీస్తానన్న పవన్‌ కళ్యాణ్,  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని చెప్పిన హోంమంత్రి అనిత ఈ ముగ్గురూ అంజలి విషయంలో ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కళ్యాణి డిమాండ్‌ చేశారు.

కామెడీ నాటకాలు వేసుకుని వెకిలి నవ్వులు నవ్వడంలో ఉన్న శ్రద్ధ కూటమి నాయకులకు అమ్మాయిల రక్షణ మీద ఉండటం లేదు. పోలీసులను కూడా రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడానికే వినియోగిస్తున్నారు తప్ప, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాదని అంజలి ఆత్మహత్య వంటి పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయని వరుదు కళ్యాణి అన్నారు. మొన్నటికి మొన్న ఇంట్లో ఉన్న తల్లీకూతుర్ల మీద ఉన్మాది దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లి మరణించింది. మహిళల మీద ఎన్ని దాడులు, అఘాయిత్యాలు చేసినా మాకేం కాదన్న భరోసాతో ఉన్మాదులు స్వేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలా తయారైందంటే ఇంట్లో ఉన్నా, బడికెళ్లినా, పనికెళ్లినా, నడిచి వెళ్లినా.. మహిళలకు రక్షణ ఉండటం లేదని ఎమ్మెల్సీ కళ్యాణి విరుచుకుపడ్డారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ పేరు మార్చడం మినహా, మహిళల రక్షణలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని వరుదు కళ్యాణి ఆక్షేపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com