- దేశ భక్తి చిత్రాలకు పేరెన్నికగన్న ఒకప్పటి హీరో
- పూరబ్ ఔర్ పశ్చిమ్,క్రాంతి, రోటీ కపడా అవుర్ మకాన్
- కాంచ్ కి గుడియా, ఉపకార్,షాహిద్, జై హింద్
- హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయాకి గోద్ మే,
- దో బదన్, పత్తర్ కే సనమ్, నీల్ కమల్… ఇలా
- ఎన్నో హిట్ మూవీస్ ఆయన సొంతం
- బాలీవుడ్ భరత్ కుమార్ అంటూ కితాబు
- దాదాసాహెబ్ ఫాల్కె, పద్మశ్రీ, నేషనల్ ఫిలిం అవార్డులతో పాటు మరెన్నో
- అప్పట్లోనే రెండు కోట్ల కలెక్షన్స్ మూవీ హీరో
- బాలీవుడ్ పెద్దల సంతాపం
వెటరన్ బాలీవుడ్ నటుడు, ఎన్నో దేశభక్తి సినిమాల్లో నటించి దర్శకత్వం చేసిన దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత మనోజ్ కుమార్(87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారు జామున మరణించారు. మనోజ్ కుమార్ లివర్ సంబంధిత సిరోసిస్ వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మనోజ్ మరణం పట్ల సహనటులు, ప్రధాని మోడీ సంతాపం తెలియ చేశారు. మనోజ్ తుది సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ముంబై జుహులోని ఆయన నివాసంలో ఉంచారు.
మనోజ్ కుమార్ పూరబ్ అవుర్ పశ్చిమ్, క్రాంతి లాంటి దేశభక్తి సినిమాల్లో అద్భుతంగా నటించారు. ఆతరం నటులను ఉత్తేజ పరిచారు. జిస్ దేశ్ కి ధరతీ లాంటి సినిమా పాటలు అప్పట్లో చాలా చాలా పాపులర్ అయ్యాయి. ఇక ఆయన తీసిన రోటీ కపడా అవుర్ మకాన్ అప్పట్లో బాలీవుడ్ చరిత్రను మలుపు తిప్పిన సినిమాల్లో ఒకటి. దేశ భక్తిని రగిలించే సినిమాల్లో నటించినందుకు గాను ఆయన్ను భరత్ కుమార్ అని ముద్దుగా పిలుచుకునేవారు. నేషనల్ ఫిలిం అవార్డులతో పాటు ఏడు ఫిలిం ఫేర్ అవార్డులను ఆయన దక్కించుకున్నారు.
నా స్ఫూర్తి దాయక హీరో అన్న మోడీ
మనోజ్ మృతిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియచేశారు. అప్పట్లో ఆయన సినిమాలు అందరిలోనూ దేశం పట్ల కమిట్‌మెంట్ ను , చిత్తశుద్ధిని సేవా భావాన్ని కలిగించేవని తరాల తరబడి ఆసినిమాలు జాతికి ఉత్ప్రేరకాలుగా పనిచేశాయని కొనియాడారు. ఈ కష్ట సమయంలో మనోజ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. తాను మనోజ్ సినిమాలు చూసే స్ఫూర్తి పొందానని అన్నారు.
ప్రతిష్టాత్మక అవార్డులెన్నో..
మనోజ్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం, సంతాపం వ్యక్తం చేశారు. మనోజ్ కేవలం నటుడు, దర్శకుడే కాదని, స్క్రీన్ రైటర్, పాటల రచయిత, ఎడిటర్ కూడానని కొనియాడారు. 1992లో మనోజ్ కుమార్ ను పద్మశ్రీ వరించగా 2015లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు దక్కింది.
పుట్టింది పాకిస్థాన్ లో..
పాకిస్థాన్లోని ఎబొట్టా బాద్ లో పుట్టిన మనోజ్ అసలు పేరు హరిక్రిష్ణన్ గిరి గోస్వామి. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఢిల్లీకి వలస వచ్చేసింది. 1957లో ఆయన సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయినా కాంచ్ కి గుడియా అనే సినిమా ఆయనకు తొలి బ్రేక్ ఇచ్చింది. అది సినీ ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపిన సినిమా. అప్పట్లోనే రెండు కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా అది.
నటనే కాదు, అద్భుతమైన క్లాసిక్ మూవీస్ ను కూడా ఆయన తీశారు. ఉపకార్, షోర్, జై హింది లాంటి సినిమాలు వెండి తెర ఆణిముత్యాలు.హరియాలీ ఔర్ రాస్తా, ఓ కౌన్ థీ, హిమాలయాకి గోద్ మే, దో బదన్, పత్తర్ కే సనమ్, నీల్ కమల్, క్రాంతి లాంటి సినిమాలు ఎప్పటికీ గోల్డెన్ క్లాసిక్స్ గా నిలుస్తాయి.
డైరక్టర్ బై ఛాన్స్…
అసలు డైరక్టర్ అవ్వాలన్న ఉద్దేశాలు, కోరిక నాకు ఎంతమాత్రం లేవు. షాహిద్ భగత్ సింగ్ ఉరితీత నన్ను కదలించిన ఘటన. భగత్ సింగ్ స్టోరీ తెరకెక్కిస్తున్నపుడు ప్రేరణ చెంది ఆ సినిమాను అనఫీషియల్ గానే డైరక్ట్ చేశాను. ఆ తర్వాత అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని ప్రకటించారు. అదే ఉపకార్ సినిమాకు ప్రేరణ అన్నారు ఒక ఇంటర్వ్యూ లో మనోజ్ కుమార్.నటుడు అక్షయ్ కుమార్ ను తన నట వారసుడుగా ఆయన ఒకదశలో ప్రకటించారు. తన స్ఫూర్తిని ప్రోత్సహించిన ప్రజలు దేవుళ్లని మనోజ్ కొనియాడారు.
మనోజ్ కుమార్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగుతాయి. కొందరు బంధువులు విదేశాల నుంచి రావాల్సి ఉన్నందున మధ్యాహ్నం తర్వాత అంతిమ యాత్ర మొదలవుతుందని కుటుంబ వర్గాలు తెలిపాయి. మనోజ్ కుమార్ కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. భార్య కూడా అనారోగ్యంతోనే ఉన్నారు. ఆయన సినిమాల్లో సహనటులు ప్రేమ్ నాథ్, ప్రేమ్ చోప్రా, కామినీ కౌశల్, హేమమాలిని తప్పనిసరిగా ఉండేవారు.