కర్నాటకలో అపశృతి చోటు చేసుకుంది. ఓ జాతర లో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
కర్నాటకలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో జరిగిందీ విషాద సంఘటన. ఆలయంలో జాతర సందర్భంగా గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. ఇది భారీ రథం. దాదాపు 120 అడుగుల ఎత్తున్న రథం ఇది. ప్రతియేటా జాతర సందర్భంగా ఈ రథాన్ని ఊరేగిస్తారు. అయితే, ఈదురు గాలుల ధాటికి రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో జాతరకు వచ్చిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడ్డ వారిలో లోహిత్, జ్యోతి అనే ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరికి చికత్స కొనసాగిస్తున్నారు.
హుస్కూర్ మద్దురమ్మ జాతరకు తీసుకొస్తున్న దొడ్డనాగర మంగళ గ్రామ రథం చిక్కనగర మంగళ సమీపంలో కూలిపోయింది. భారీ వర్షం, ఈదురు గాలి కారణంగానే రథం కూలిపోయినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారు తమిళనాడులోని హోసూర్‌కు చెందిన రోహిత్, బెంగళూరులోని కెంగేరికి చెందిన జ్యోతి గా గుర్తించారు. లక్కసంద్రకు చెందిన రాకేష్, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి హెబ్బుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గత యేడాది కూడా రాయసంద్ర గ్రామ రథం కూడా కూలిపోయింది. కానీ, అప్పుడు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.