తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి… ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా యూఎస్ – ఇండియానాకు చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో “ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్” డియెగో మోరాలెస్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు… తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సహాకాలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు. ఈ లక్ష్య సాధనలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణలో రూ.1.78 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలతో చేసుకున్న ఒప్పందాల గురించి తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్ గా మారుతున్న తెలంగాణ వైపు యావత్తు ప్రపంచం చూస్తుందన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించి… నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించామన్నారు. నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు కోర్సులను అందిస్తున్నామన్నారు.
ఐటీ రంగంలోనే కాకుండా బయోటెక్, ఫార్మా తదితర రంగాల్లోనూ తెలంగాణ గ్లోబల్ మార్కెట్ లో అత్యుత్తమ స్థానంలో ఉందన్నారు.
ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ప్రారంభించిందన్నారు. మెడికల్ డివైజెస్, ఔషధ పరిశ్రమ, జీవ విజ్ఞానం, వ్యవసాయం, తయారీ తదితర రంగాల్లో ఇండియానా రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి శ్రీధర్ బాబును డియెగో మోరాలెస్ ఆహ్వానించారు.
తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించండి
- Advertisement with us -