హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం సాంధించింది. 38 ఓట్ల మెజార్టీలో మజ్లీస్ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్ధిత్వంతో పోటీ చేసిన గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. మజ్లీస్ అభ్యర్ధి మీర్జా రియాజ్ కు 63 ఓట్లు పోలయ్యాయి. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలసి బీజేపీకి ఉన్న 25 ఓట్లు ఆ పార్టీ అభ్యర్ధి గౌతమ్ రావుకి పోల్ అయ్యాయి. అయితే వాస్తవానికి ఎంఐఎంకి సొంతగా 49 ఓట్లు మాత్రమే ఉండగా ఆ పార్టీ అభ్యర్ధి మీర్జా రియాజ్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్లు కలుపుకుని మొత్తం 63 ఓట్లు వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆశలు అయితే పెట్టుకుంది కానీ ఆదిశగా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి చెందిన స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు ఎవరిని ఓటింగ్ లో పాల్గొనవద్దని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరూ ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ ఏకపక్షంగా ఎంఐఎంకి ఓట్లు వెయ్యడంతో ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎన్నికల్లో 78.57 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 112 ఓట్లు ఉండగా అందులో 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.