-
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా చూపడానికి భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు అయిన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై 100 దేశాలకు పైగా ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు.
ఆనాడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా రెండు బలమైన శక్తులు కోల్డ్ వార్ చేస్తుండగా… ఎదుగుతున్న భారతదేశం అలీన విధానాన్ని తీసుకుని ముందుకు వెళ్లిందని, భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లేవని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండు రోజులపాటు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.
ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. ప్రపంచ పటంలో హైదరాబాదును నిలిపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన జెండర్, యూత్, న్యాయ మూల సిద్ధాంతాలు వివరించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని.. వాటిని ఈ ప్రపంచానికి చాటేందుకు ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాహకంగా ఉపయోగించుకుంటుందన్నారు.