- పెహల్గాం దాడికి కారకులైన ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
- ఈ ఇద్దరి ఇళ్లలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు
- మరో ఇద్దరి ఆచూకీ కోసం వేట
- పట్టిచ్చిన వారికి 20 లక్షల నగదు ప్రోత్సాహకం
పెహల్గాం లో ఉగ్రదాడి జరిపి 28 అమాయక టూరిస్టులను బలి తీసుకున్న ఉగ్రమూకలకు బుద్ధి చెప్పే పనిలో పడింది కేంద్రం.. ఈ దాడిలో కీలకంగా భావిస్తున్న ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ల ఇళ్లను జమ్మూ కశ్మీర్ రక్షణ దళాలు పేల్చివేశాయి.వారి ఇళ్లలో పేలుడు పదార్ధాలు పెద్ద ఎత్తున నిల్వ చేసినట్లు కనుగొన్నారు.పెహల్గాం దాడిలో పాల్గొన్న థోకర్ అనే ఉగ్రవాది అనంత్ నాగ్ జిల్లాకు చెందినవాడని,మరొకరైన షేక్ ఆసిఫ్ ఫుల్వామా వాస్తవ్యుడనీ భద్రతా దళాలు కనుగొన్నాయి. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షలు నగదు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. తప్పించుకున్న ఇద్దరు టెర్రరిస్టులు హషీం ముసా అలియాస్ సులేమాన్, ఆలిభాయ్ అలియాస్ తన్హా భాయ్. వీరిద్దరూ కూడా పాకిస్థాన్ లోఉన్న ఉగ్ర వాదసంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారు. పెహల్గాం దాడికి కారకులైన ఉగ్రవాదులను ట్రాక్ చేసి కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. అమాయక టూరిస్టులను బలి తీసుకున్న వారికి ఎవరూ ఊహించనంత దారుణమైన, కఠిన శిక్షలు విధిస్తామన్నారు.140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షలకు విలువిస్తూ ఉగ్రవాదుల నడ్డి విరుస్తామని మోడీ ప్రకటించారు.పెహల్గాం దాడికి నిరసనగా భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై పలు దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుంది. పాకిస్థాన్ తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను తెంపేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.