- వాలంటీర్లకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ గవర్నెన్సా?
- పర్సనల్ డిటైయిల్స్ పెడితే ప్రమాదమా?
- ఓటీపీలు వస్తే చెప్పాలా?
- టెక్నాలజీకి తగినట్టుగా
- గవర్నమెంటు ఆఫీసులను అప్ డేట్ చేశారా?
- ప్రజల సందేహాలు
వాట్సాప్ లో కంప్లయింట్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందా…?
ఇంక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదా…?
వ్యక్తిగత సమాచారం భద్రమే కదా…?
గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్స్‌ప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో ఈ విధమైన అనుమానాలు, భయాలు సుడులు తిరుగుతున్నాయి. గవర్నమెంటు ఉద్యోగస్తులు అందించే సర్వీసులు ఎంత గొప్పగా ఉంటాయో ప్రజలు అందరికీ తెలిసిందే. పైపెచ్చు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్ని రకాల ఆర్థిక నేరాలు జరుగుతున్నాయో జగద్వితమే. ఈ పరిస్ధితుల్లో వాట్సప్ గవర్నెన్స్ అని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు కొత్త పద్దతి తీసుకురావడంతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే సైబర్ క్రైం నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వాట్సాప్ ల్లో పర్సనల్ బ్యాంక్ డిటైయిల్స్, ఇతరత్రా పెడితే, రేపు ఓటీపీ వచ్చింది చెప్పమనంటే, చెప్పాలా? వద్దా? అని నెటిజన్లు అడుగుతున్నారు. వాట్సాప్ కదా ఓటీపీలు అడగదని కొందరంటున్నారు. ఈ విషయంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని కొందరు సూచనలిస్తున్నారు.
మరి గవర్నమెంటు ఏక్సిస్ లోకి ప్రజల వాట్సాప్ స్టేటస్ లు, మెసేజులు వెళ్లిపోతే, వారు వైసీపీ పార్టీయా? కాంగ్రెస్ పార్టీయా? కూటమి పార్టీలకు సంబంధించిన వ్యక్తా అన్న విషయం సునాయాశంగా తెలిసిపోయే అవకాశం ఉంది. ఈ విషయంపై కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమేతర పార్టీలకు చెందిన వ్యక్తులైతే ప్రభుత్వ పథకాలు కట్ చేసి వేధించే అవకాశాలు ఉన్నాయి కదా అని ప్రస్తుతుం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులను దృష్టిలో ఉంచుకుని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య యుద్ధాలే జరుగుతున్నాయని ఇప్పుడు వాట్సప్ ద్వారా ప్రజల వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కితే ఇక వాట్సప్‌లో కూడా వాతావరణం చోటు చేసుకుంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ డేటా చౌర్యం చేసిందనే అభియోగాలు వచ్చాయి. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల వివరాలను అక్రమంగా ఆ డేటా కంపెనీకి యాక్సెస్ ఇచ్చారనేది సారాంశం. ఈ నేపథ్యంలో డేటా అనలిస్ట్ సంస్థపై కేసు కూడా నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, ఐటీ గ్రిడ్స్ అధికారులు రాష్ట్రంలోని సుమారు 3.5 కోట్ల మంది ప్రజల డేటాను తీసుకున్నారని ఇండో ఆసియా న్యూస్ సర్వీసెస్ తెలిపింది. వీరందరూ ఏపీలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని పేర్కొంది. 2025కి వచ్చేసరికి ఇప్పుడు డైరక్టుగా వాట్సాప్ ల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ప్రభుత్వం దగ్గరుంటే దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేకపోలేదని గతానుభవాను గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడీ వాట్సాప్ సేవలద్వారా ప్రజలకి సీఎం చంద్రబాబు మరో సందేశాన్ని కూడా ఇస్తున్నారని అంటున్నారు. అదేమిటంటే మాజీ సీఎం జగన్మోహనరెడ్డి హయాంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. వారికి నిరుద్యోగ భృతి రూ. 5 వేల వరకు ఇచ్చారు. అలాగే ఒక లక్షా 25 వేల సచివాలయ ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పుడీ వాట్సాప్ సేవల కారణంగా వీరి పరిస్థితేమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వాలంటీర్లనైతే ఇక తీసుకోరనేది స్పష్టమైపోయింది. గ్రామ సచివాలయ ఉద్యోగులను కూడా వేరేశాఖలకు బదిలీ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్ లోనే ప్రజలు పొందుతుంటే ఇక వారికి పనేం ఉంటుందనే వాదన తెరపైకి వస్తోంది.
ఇక్కడ ఒక సామాన్యుడు తనకి సర్టిఫికెట్ కావాలని డిటైయిల్స్ వాట్సాప్ లో పెడితే, అది జిల్లా కలెక్టరు కార్యాలయానికి వెళుతుందా? అక్కడెవరు మానిటరింగ్ చేస్తారు? ఆ సమస్య ఆటోమేటిక్ గా సంబంధిత శాఖకు వెళ్లిపోతుందా? మరి వారు పట్టించుకుంటారా? ఆ స్థాయిలో టెక్నాలజిని డవలప్ చేశారా? ప్రభుత్వాధికారులకి ట్రైనింగు ఇచ్చారా? రాష్ట్రం మొత్తంమ్మీద ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలను వాట్సాప్ గవర్నెన్స్ కి తగినట్టుగా అప్ గ్రేడ్ చేశారా? లేదా? అనే సందేహాలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి.
కొత్త టెక్నాలజీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను ప్రభుత్వం అందిస్తోంది. మరిది సాధ్యమా? అంటున్నారు. ఏదేమైనా ఇది కూడా డేటా చౌర్యం లాంటిది కాదు కదాని వైసీపీ నేతలు అప్పుడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. తెలుగుదేశం నేతలు కూడా అంత ఆసక్తి చూపించడం లేదు. కేవలం సీఎం చంద్రబాబు తనని తాను నమ్మి చేస్తున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. గతంలో ఫీడ్ బ్యాక్ తీసుకుని, ఎవరికీ ఇష్టం లేకపోతే ఆయన ఆ స్కీమ్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
ఇంతకీ వాట్సాప్ గవర్నెన్స్ విషయానికి వస్తే… తొలివిడతగా దేవాదాయ, ఏపీఎస్ ఆర్టీసీ, సీఎంఆర్ఎఫ్, రెవెన్యూ, కరెంటు ఆఫీసు, అన్న క్యాంటీన్, మున్సిపల్ కార్యాయలయాల వంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వకార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.