సకల మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ గర్వకారణమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తన ఆశ, ఆశయం కోసం.. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా వెనుదిరగకుండా ధైర్యంగా నిలబడ్డారని, ఆ నైజమే ఆయనకు పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టిందని మందకృష్ణ మాదిగను కొనియాడారు. పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా మందకృష్ణను ఎంపీ ఈటల రాజేందర్ కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నంపెట్టే ప్రజలకు అండగా ఉన్న జాతికి, సంపద సృష్టించి అన్నింటికీ దూరమైన జాతికి, అణచివేతకు గురైన జాతికి మందకృష్ణ చుక్కానిగా నిలిచారని ప్రశంసించారు. తన మాదిగ జాతిని పైకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో నమ్ముకున్న ఆశయాన్ని చేరుకునేదాకా, గమ్యాన్ని ముద్దాడేదాకా వెరవకుండా ఉన్నారని గుర్తు చేశారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ననలు అందుకున్నారని, దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి ఎంపికయ్యారని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. జాతి గౌరవం నిలబెట్టిన మందకృష్ణ.. ఆ జాతికే గర్వకారణమని కొనిడాయారు.