- hr@opm.gov ఈ అడ్రస్ తో మెయిల్ వస్తే టెర్రర్
- రాత్రికి రాత్రి ఉద్యోగులకు ఈమెయిల్ సందేశం
- ఫెడరల్ వర్కర్లలో భయం భయం
- 20 లక్షల మందికి ఊస్టింగ్ ఆర్డర్లు రెడీ
- స్వచ్ఛందంగా తప్పుకుంటే ప్రోత్సాహకాలు
- అవునన్నా కాదన్నా అందరినీ పెయిడ్ లీవ్ లోనే
- కొత్త రిక్రూట్ మెంట్లు ఉండబోవు
- అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో గందరగోళం… భయం… భయం…
- ప్రభుత్వ వ్యయం తగ్గించడానికి ట్రంప్ నిర్ణయం
- కాస్ట్ కటింగ్ తో రెండు ట్రిలియన్ డాలర్ల ఆదాకు ప్లాన్
- ఎలన్ మస్క్ సలహాతో ముందుకు కదిలిన ట్రంప్
అమెరికాను తన విధానాలతో సమూలంగా మార్చేస్తానంటున్న ట్రంప్ చర్యలు ఇల్లీగల్ మైగ్రంట్స్‌నే కాదు అమెరికా ప్రభుత్వోద్యోగుల వెన్నులో కూడా వణుకు పుట్టిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం సైజ్, ఖర్చు తగ్గించేద్దామనుకుంటున్న ట్రంప్ 20 లక్షలమంది ఉద్యోగులకి ఊస్టింగ్‌ఆర్డర్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగుల్లో ఒక భయానక వాతావరణానికి, అభద్రత భావానికి గురి చేసి ఉక్కిరి బిక్కిరి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ఆయన సలహాదారు బిలియనీర్ ఎలన్ మస్క్ సూచనలు మరింత పురికొల్పుతున్నాయి.
20 లక్షలమందికి ఊస్టింగ్ ఆర్డర్లు
ప్రభుత్వంలో పనిచేస్తున్న ఫుల్ టైమ్ ఫెడరల్ వర్కర్లను ఉద్యోగాలు వదిలి పోవాలని, అందరికీ ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు.ఈ రిట్రెంచ్ మెంట్ విధానం ప్రకారం ఆ ఉద్యోగులంతా సెప్టెంబర్30 వరకూ పేరోల్స్ లోనే ఉంటారు. అయితే వారికి పనులు మాత్రం పెద్దగా ఉండవు. లేదా ఇప్పుడున్న పని విధానం బాగా తగ్గిపోతుంది. ఫెడరల్‌ఎంప్లాయీస్ కు ఈ ఆటో జనరేటడ్ మెయిల్‌తో ట్రంప్ వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగులంతా ఈ ప్రతిపాదనపై తమ నిర్ణయాన్ని ఫిబ్రవరి లోగా చెప్పాలని, ఆసక్తి ఉన్న వారంతా ప్రభుత్వ అక్కౌంట్ నుంచి రిజైన్ అన్న పదం టైప్ చేసి రిప్లయ చేస్తే చాలని ఆమెయిల్‌లో స్పష్టం చేశారు.
ఎవరెవరికి మినహాయింపు?
ఇమ్మిగ్రేషన్ పై ఉన్నవారికి, రక్షణ శాఖలో ఉన్నవారికి, అమెరికా పోస్టల్ సర్వీసు ఉద్యోగులకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని తన రాజకీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. పోస్టల్ సర్వీస్ ఉద్యోగులను మినహాయిస్తే అమెరికాలో 20లక్షలకు పైగానే సివిలియన్ ఉద్యోగులు ఉన్నారు. అమెరికాఫెడరల్ ప్రభుత్వంలో ఎక్కువ మంది సెక్యూరిటీ కి సంబంధించిన ఉద్యోగులే ఉంటారు. వారు కాక వృద్ధతరానికి సేవలందించేవారు, ఆరోగ్య రంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ, ప్రభుత్వ బిల్లుల పర్యవేక్షణ, వసూళ్ల రంగాల్లోనూ మిగిలిన ఉద్యోగులు ఉన్నారు.
గౌరవంగా సాగనంపుతాం
ఫెడరల్ వర్క్ ఫోర్సును క్రమబద్ధీకరించి మరింత సౌకర్యవంతంగా, ఉండే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మిలటరీతో సహా కొన్ని ఏజెన్సీలలో మరింత సిబ్బందిని తీసుకోదలచినా ఇతర విభాగాల సిబ్బందిని సాధ్యమైంతగా కుదించాలని, లే ఆఫ్ లతో పంపేయాలని ట్రంప్ నిర్ణయించారు. సిబ్బంది ఎవరికీ ఉద్యోగాల గ్యారంటీ ఉండదని తేల్చేశారు. ఈసంస్కరణలేవీ మిమ్మల్ని అవమానించడానికి కాదు మిమ్మల్ని గౌరవంగా సాగనంపడంలో భాగమేనంటూ ఆ మెయిల్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ట్రంప్ ఈ ప్రతిపాదన అయితే చేశారు కానీ… ఎందరు దీనికి ఆమోదిస్తారన్నది సందేహమే. ఐదు నుంచి 10 శాతం మాత్రమే ఉద్యోగాలు వదులుకునేందుకు సిద్ధంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. అయితే ఈ నిర్ణయంతో ఖజానాపై వంద అమెరికన్ బిలియన్ డాలర్ల బర్డెన్ తగ్గుతుంది.
రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల కోతకు ప్లాన్
అమెరికా మొత్తం బడ్జెట్ విలువ 6.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. అయితే రెండు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చులను తగ్గించేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చీ రాగానే కాస్ట్ కట్టింగ్ కోసం ఐడియాలివ్వాలని బిలియనీర్ ఎలన్ మస్క్ ని ట్రంప్ కోరారు. మస్క్ సూచనల మేరకే ఈ ఉద్యోగులను సాగనంపే పని ఎంచుకున్నారు.
అయితే ట్రంప్ నిర్ణయాలను ఫెడరల్ వర్కర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరందరికీ ఉద్యోగ సంఘాల దన్ను ఉంది. నేషనల్ ట్రెజరీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులెవరూ రాజీనామా చేయవద్దని సూచించింది. ఈ యూనియన్ కింద లక్షా 50 వేలమంది ఉద్యోగులున్నారు.
hr@opm.gov
ఈఅడ్రస్ నుంచి మెయిల్ వస్తే చాలు ఉద్యోగులు హడలి పోతున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు వదలి ఎలా పోవాలి? ఎక్కడికి పోవాలి అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ ఏజెన్సీలకు పంపిన మరో ఈ మెయిల్ లో ఉద్యోగులను అందరినీ పెయిడ్ అడ్మినిస్ట్రేటివ్ లీవ్ లోనే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఎవరైనా ఉద్యోగంలో కొనసాగాలనుకున్నా వారి రిటైర్మెంట్ వరకూ అలా పెయిడ్ లీవ్ లోనే కొనసాగుతారు. దారికి రాని ఉద్యోగులను క్రమబద్ధీకరించి, ఎలా పంపాలో తమకు తెలుసునని ఆ మెయిల్ లో ఉంది. రాజీనామా చేసిన వారంతా మరో ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందవచ్చనీ సలహా ఇచ్చింది.
తక్కువ సర్వీస్ వారే టార్గెట్
ఫెడరల్ ఎజెన్సీ హెడ్స్ అందరికీ తక్కువ సర్వీస్ ఉన్నవారి లిస్ట్ తయారు చేయమని ఆదేశించింది. దీని ప్రకారం రెండు, మూడేళ్ల సర్వీస్ ఉన్న వారందరినీ పీకి పారేస్తారు. అలాగే కొత్త రిక్రూట్ మెంట్లను ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారి పదవులు, పనులను పునర్నిర్వచిస్తారు.
ఇది మరో భ్రమ..
పునర్నిర్వచనం పేరుతో వేలాది మందిని సులభంగా తొలగించవచ్చు. ఇలా వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి ఉద్యోగుల్లో భయానక, అభద్రతా వాతావరణాన్ని కల్పించి వారంతట వారే స్వచ్ఛందంగా తప్పుకునేలా చేయాలన్నది ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది.