ఆంధ్ర ప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. శాసన సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని, పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని నారా లోకేష్ తెలిపారు.
ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు.
గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో సైతం 2014, 2018, 2019లలో మూడు డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలు విడుదల చేశారు.